కర్మయోగి: బి.సి. రాయ్‌ / 1882–1962

16 Jun, 2022 13:13 IST|Sakshi

చైతన్య భారతి

బిధాన్‌ చంద్ర రాయ్‌ ప్రముఖ వైద్యులు. కాంగ్రెస్‌ నాయకులు. విద్యావేత్త, ధార్మికుడు.  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ఆ రాష్ట్రాన్ని సమస్యల నిలయం స్థాయి నుంచి సంపదకు నెలవుగా మార్చేశారు. ఎన్నో కీలకమైన పదవులు అధిష్టించారు. కలకత్తా మేయర్‌గా, కలకత్తా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 1948లో ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ పదవిని స్వీకరించడానికి నిరాకరించారు. నిజానికి నాల్గవ కింగ్‌ జార్జి ఆయనను ఆ పదవికి ఎంపిక చేశారు.

 కానీ, క్రియాశీలక రాజకీయాలలో కొనసాగాలని భావించిన రాయ్‌ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విద్యార్థి దశ నుంచే రాయ్‌ చాలా పట్టుదల కలిగిన మనిషిగా గుర్తింపు పొందారు. ఇంగ్లండులోని సెయింట్‌ బార్తోలోమ్యూలో ప్రవేశం కోసం ఆయన పట్టు వీడకుండా 29 సార్లు దరఖాస్తు చేసి చివరకు విజయం సాధించారు. రాయ్‌ జీవితంలో చాలామంది విస్మరించిన ముఖ్యమైన అంశాలు అనేకం ఉన్నాయి.

ఒక పారిశ్రామికవేత్తగా ఆయన షిల్లాంగ్‌ హైడ్రో–ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్, ఎయిర్‌వేస్‌ ఇండియా సంస్థలను నెలకొల్పారు. పాత్రికేయుడిగా ఆయన చిత్తరంజన్‌దాస్‌ ప్రారంభించిన కొన్ని జర్నల్స్‌ను నడిపించే బాధ్యతను స్వీకరించారు. రాయ్‌ అసలు సిసలు కర్మయోగి. ఆయన మరణించే చివరి క్షణం వరకూ పని చేస్తూనే ఉన్నారు. ఈ స్థిరచిత్తుడైన మృదుస్వభావి 1962 జూలై 1న తుదిశ్వాస విడిచారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే. బ్రాహ్మో గీతం అంటే ఎంతో ఇష్టపడే రాయ్, తాను చనిపోయే రోజున కూడా దాన్ని ఆలపించారు. ఆయన జన్మదినోత్సవాన్ని భారత జాతి ‘వైద్యుల దినం’గా జరుపుకుంటోంది. 
– స్వర్గీయ నితీశ్‌ సేన్‌గుప్తా (లోక్‌సభ మాజీ ఎంపీ) మాటల్లో..

మరిన్ని వార్తలు