ఆదర్శ భారత్‌: బిల్‌గేట్స్‌ని ఆకట్టుకున్న భారత్‌

25 Jun, 2022 15:09 IST|Sakshi

భారతదేశ శక్తి సామర్థ్యాలు, ఆ దేశం సాధించిన ఘనత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బిల్‌ గేట్స్‌ ఇటీవల అన్నారు. అందుకాయన చూపిన నిదర్శనం కోవిడ్‌ నియంత్రణలో భారత్‌ ఆదర్శంగా నిలబడటం. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌ అత్యంత క్లిష్టమైన సమయంలో ఆరోగ్య సవాళ్లను అధిగమించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్‌–19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. భారత్‌ సాధించిన ఈ విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి అని కూడా గేట్స్‌ అన్నారు.

మొదట అంశం: పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పని చేయడం. రెండో అంశం:  భారత్‌ తనకున్న సుదీర్ఘ అనుభవం, అవగాహన, మౌలిక వసతులను ఉపయోగించుకుని కోవిడ్‌పై పోరాటానికి ప్రచారం చేయడం.  మూడో అంశం: మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్‌ నిలబెడుతూ ఉండటం. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందివ్వడం. నాలుగోది : భారతదేశం తన వ్యాక్సినేషన్‌  కార్యక్రమాన్ని డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో విజయవంతంగా మానిటర్‌ చేయడం. ఈ మౌలికమైన అంశాలన్నిటితో ఇండియా ప్రపంచానికి ఒక ధైర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్లలో ఇండియా ఆరోగ్య అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యం లేదన్న భావన కూడా గేట్‌ మాటల్లో ధ్వనించింది.

మరిన్ని వార్తలు