చైతన్య భారతి.. జె.సి.బోస్‌ / 1858–1937

20 Jun, 2022 09:38 IST|Sakshi

శాస్త్ర సంపన్నుడు

జగదీశ్‌ చంద్రబోస్‌ చనిపోయిన అరవై ఏళ్ల తరువాత 1998లో చెలరేగిన వివాదం ఆయన కాలంలో భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ఉన్న పేరు ప్రతిష్టలకు ప్రతీకగా నిలిచింది. ‘మార్కోనీ వైర్‌లెస్‌ను కనుగొన్నది బోసే’ అని శీర్షిక పెట్టి ఓ వార్తాపత్రిక ప్రచురించింది. కొహెరర్‌ అనే పరికరాన్ని జగదీశ్‌ చంద్రబోస్‌ కనిపెట్టారని, అది జరిగిన రెండేళ్లకు 1902లో దానిని వినియోగించుకుంటూ గుగ్లీల్మో మార్కోనీ వైర్‌లెస్‌ రేడియోను అభివృద్ధి చేశారనీ కథనాలు వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా ఈ వార్తను ప్రచురించారు. నిజానికి, శాస్త్ర విజ్ఞానాన్ని స్వేచ్ఛగా పరస్పరం పంచుకోవాలని, తమకు తెలిసిన దానిని తోటి శాస్త్రవేత్తలతో చెప్పాలని బోస్‌ భావించేవారు.

1901లో ఆయన తన మిత్రుడైన రవీంద్రనాథ్‌ టాగూర్‌కు ఇలా రాశారు : ‘‘చేతిలో పేటెంట్‌ కాగితం పట్టుకొని, ఒక ప్రముఖ టెలిగ్రాఫ్‌ సంస్థ యజమాని నా దగ్గరకు వచ్చారు. లాభంలో సగం తీసుకుని బదులుగా వ్యాపారానికి సహాయం అందించవచ్చని నాకు ప్రతిపాదించారు. మిత్రమా! ఒకసారి ఆ విష వలయంలో చిక్కుకుంటే ఇక నాకు నిష్కృతి లేదు’’.. అని. రేడియో తరంగాలను కనిపెట్టడానికి సెమీ కండక్టర్‌ను వాడిన తొలి వ్యక్తి బోస్‌. ప్రస్తుతం ప్రతి చోటా కనిపిస్తున్న మైక్రోవేవ్‌కు సంబంధించిన అనేక విడి భాగాలను ఆయనే కనిపెట్టారు. విద్యుత్‌ చలనాలను గ్రహించే పరికరానికి ఆయన పేటెంట్‌ సంపాదించారు.

అది ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలలో ఒకటి. 1900 తర్వాత జగదీశ్‌ చంద్ర బోస్‌  జంతువులు, వృక్షాల శరీర ధర్మ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. భౌతిక శాస్త్రానికీ, శరీర ధర్మ శాస్త్రానికీ మధ్య ఉన్న సరిహద్దులపై దృష్టి పెట్టడం ద్వారా అన్ని అంశాలకూ అంతర్లీనంగా ఉన్న సమైక్యతను చూపెట్టవచ్చని ఆయన భావించారు. 1917లో ఆయన కలకత్తాలో బోస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. భారత్‌లోని మొట్టమొదటి శాస్త్ర పరిశోధనా సంస్థ అది. అదే సంవత్సరం ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘సర్‌’ బిరుదు లభించింది. 1920లో ఆయన గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన రాయల్‌ సొసైటీకి ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన తొలి భారతీయ శాస్త్రవేత్త ఆయనే. బోస్‌ విజ్ఞానవేత్తే కాక, కథా రచయిత కూడా. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో మార్గదర్శి అయిన బోస్‌ వారసత్వం భారత విజ్ఞాన శాస్త్రానికి నిత్యం స్ఫూర్తిదాయకం. 
– ఆర్‌.ఎ.మషేల్కర్, శాస్త్రీయ పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్‌ జనరల్‌

మరిన్ని వార్తలు