Azadi Ka Amrit Mahotsav: శతమానం భారతి.. లక్ష్యం 2047

7 Jun, 2022 14:05 IST|Sakshi

స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో బ్రిటిష్‌ న్యాయం ఎలా ఉండిందో తెలిసిందే. భగత్‌సింగ్, సుఖ్‌దేశ్, రాజ్‌గురు, తిలక్, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధుల్ని విచారించి, శిక్షలు విధించడంలోని వివక్షకు ఆనాటి కోర్టులు ప్రతీకలు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య పాలనలో ఆ దుస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం, ప్రభుత్వాధీనంలోని సంస్థలు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను హరించకుండా పరిరక్షించే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకుంది.

నవ భారత నిర్మాణానికి, ప్రజాస్వామ్య పాలనకు నియమ నిబంధల చట్రం ఏర్పడింది. మన న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రమైనదంటే.. పాలక పక్షానికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించిన సవరణలను గానీ, మరే ఇతర మార్పు చేర్పులను కానీ చేయకూడదని 1973లో కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది.
చదవండి: సామ్రాజ్య భారతి: జననాలు

ఏదైనా రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అత్యవసర పరిస్థితి ద్వారా రద్దు చేయాలని గవర్నర్‌ సిఫారసు చేస్తే దానిపై న్యాయ సమీక్ష జరిపి, గవర్నర్‌ నిర్ణయంలో సదుద్దేశం లేదని నిర్థారణ అయినట్లయితే బర్తరఫ్‌ అయిన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఎస్‌.ఆర్‌.బొమ్మై (1994) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఎన్నికల్లో పౌరుల ఓటు హక్కు వినియోగంపై న్యాయ వ్యవస్థ కల్పించిన ‘నోటా’ అవకాశం ఒక ప్రజాస్వామ్య సంస్కరణ అనే చెప్పాలి. వచ్చే 25 ఏళ్లల్లో మరిన్ని మెరుగైన మార్పులు రాగలవని ఆశించవచ్చు.

మరిన్ని వార్తలు