శతమానం భారతి: లక్ష్యం 2047 పట్టణీకరణ

13 Jun, 2022 14:18 IST|Sakshi

ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 60 శాతం వాటా పట్టణాలదే. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ 16వ శతాబ్దం నుంచే ప్రారంభమవడానికి కారణం పారిశ్రామిక విప్లవమే. భారతదేశంలో పట్టణీకరణ స్వాతంత్య్రానంతరమే వేగం పుంజుకొంది. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లలో పట్టణాల్లో నివసించే వారు 37.71 కోట్లు.. అంటే 31.16 శాతం. 2030 నాటికి దేశ జనాభాలో పట్టణ ప్రజల వాటా 50 శాతానికి చేరుతుందని ’ప్రపంచ బ్యాంకు, మెకిన్సే’ నివేదికలు వెల్లడించాయి. 1951లో దేశంలో పది లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సంఖ్య తొమ్మిది. 2011 నాటికి అది 53 కు పెరిగింది.

అందులో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. దేశంలోని పట్టణ జనాభాలో 37 శాతం మెట్రోపాలిటన్‌ నగరాల్లోనే నివసిస్తోంది. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో జనాభా 40 లక్షల పైమాటే కాబట్టి, వాటిని మెగా నగరాలుగా వర్గీకరించారు. భారతదేశంలో పట్టణీకరణ విధానాలన్నీ స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకొన్నవే.

75 సంవత్సరాల పట్టణీకరణ విధానాలు, ప్రణాళికల వల్ల భారత స్థూల దేశీయోత్పత్తిలో పట్టణాల వాటా పెరిగింది. చండీగఢ్‌ తొలి పంచవర్ష ప్రణాళికా కాలంలో నిర్మితమైంది. పట్టణీకరణకు ఊతమిచ్చే వ్యవస్థలను, సంస్థలను వివిధ ప్రణాళికా కాలాల్లోనే ఏర్పాటు చేశారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో ’నవీన పట్టణీకరణ’ ప్రాచుర్యం పొందుతోంది. అక్కడి పట్టణీకరణ ఒక క్రమ పద్ధతిలో సుస్థిరంగా రూపుదిద్దుకొంది. ఈ తరహా విధానాలను మన ప్రభుత్వాలు కూడా పరిశీలించాలి.

మరిన్ని వార్తలు