Congress Radio Facts: క్విట్‌ ఇండియా రేడియో! సీక్రెట్‌ ఫైల్స్‌

26 Jul, 2022 09:18 IST|Sakshi

క్విట్‌ ఇండియా ఉద్యమ వేళ  1942లో ఒక రహస్యవాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు దీనిని ‘కాంగ్రెస్‌ ఇల్లీగల్‌ రేడియో’ అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘కాంగ్రెస్‌ రేడియో’ అని పిలిచారు. దివంగత సోషలిస్టు రచయిత మధు లిమాయే ‘ఆజాద్‌ రేడియో’ అని పేర్కొన్నారు. ఈ రహస్య ప్రజావాణికి వ్యూహకర్త రామ్‌ మనోహర్‌ లోహియా! ఈ రేడియో ప్రసారాల క్రతువు నిర్వహించిన బృందం 20 నుంచి 40 ఏళ్ల వయసు గల ఏడు యువకిశోరాలు! ఇంతవరకు పూర్తిగా తెలియని ఈ సమాచారం మనకు గొప్ప తృప్తినీ, గర్వాన్ని ఇస్తుంది. 

కరేంగే.. యా మరేంగే
1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్‌ వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరేంగే... యా మరేంగే’ అనే పిలుపునిచ్చారు. అది జాతిమంత్రమై దేశం ఎల్లెడలా పాకింది. బ్రిటిషు అధికారులు ఈ నాయకులను అగ్రస్థాయి నుంచి, అడుగున బ్లాకు స్థాయి దాకా చెరసాలల్లో నింపేశారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని రహస్యంగా ఉద్యమంలో సాగారు. అరెస్టుల కారణంగా 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది.

ఆ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘కాంగ్రెస్‌ రేడియో’! 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిషు ప్రభుత్వం కైవశం చేసుకునే దాకా (అంటే 1942 నవంబర్‌ 12 దాకా) గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక ‘సాధన’లో సోషలిస్టు నాయకుడు మధు లిమాయే ఈ చరిత్రాత్మక ఆధారాలు రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్‌ రేడియో పరికరాలను విఠల్‌రావ్‌ పట్వర్థన్‌ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవలసి వస్తుందని గోదావరి నదిలో పడవేశారని పేర్కొన్నారు. 

పోలీస్‌ మానిటరీ రిపోర్ట్‌!
‘అన్‌టోల్డ్‌  స్టోరీ ఆఫ్‌ బ్రాడ్‌కాస్ట్‌ డ్యూరింగ్‌ క్విట్‌ఇండియా మూవ్‌మెంట్‌’ అనే పుస్తకం  2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్‌ డివిజన్‌ ప్రచురించింది. దాని ప్రకారం ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్‌చటర్జీ 1984 నుంచి నేషనల్‌ ఆర్కైవ్స్‌లో గాలించి, పరిశోధన చేశారు. వీరికి ‘పోలీస్‌ మానిటరీ రిపోర్ట్‌’ అనే పోలీసు ఇంటెలిజెన్స్‌ సీక్రెట్‌ ఫైల్‌ తారసపడింది. దీన్ని గురించి ఎవరూ ఎక్కడా రాయలేదు.

అప్పట్లో ‘ఆజాద్‌ రేడియో’ ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్‌ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబరు 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన పోలీసు ఇంటెలిజెన్స్‌ అధికారులు పరిశీలించిన అంశాలు. ఈ రేడియో ప్రసార విషయాలను గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్‌ నుంచి బెంగాల్‌ దాకా, బిహార్‌ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర దాకా సమాచారాన్ని సవ్యంగా ఇచ్చారని బోధపడుతుంది.

కీలకం.. లోహియా!
‘... స్కాట్‌  సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించాను.  కాంగ్రెస్‌ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం సోషలిస్ట్‌ రాజకీయ నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా అని తెలిసింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర  భారతదేశమని అక్టోబరు 23వ తేదీ ప్రసారాలలో  ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబరు 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది పేదల  కోసం విప్లవం.

రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’ అని బ్రిటిష్‌ గవర్నమెంట్‌ అడిషనల్‌ సెక్రటరీ హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగార్‌ ఈ ఆజాద్‌ రేడియో ప్రసారాల పూర్వాపరాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్‌  హింద్‌ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్‌ రేడియో. 
  – డా. నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు

(చదవండి: అఖండ భారత స్వతంత్ర ప్రధాని: మౌలానా బర్కతుల్లా)

మరిన్ని వార్తలు