Che Guevara Life History: ఇండియాకు చేగువేరా

30 Jun, 2022 10:44 IST|Sakshi

నేడు చేగువేరా జయంతి కాదు. ఆయన వర్ధంతి కూడా కాదు. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఆయన 1959లో ఇదే రోజు (జూన్‌ 30) తొలిసారి భారతదేశం వచ్చారు! ఆ రాత్రి పొద్దు పోయాక ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగారు. మర్నాడు నాటి ప్రధాని నెహ్రూ తన అధికార నివాసం  తీన్‌మూర్తి భవన్‌లో చేగువేరాను సాదరంగా ఆహ్వానించారు (కింది ఫొటో).  నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు చేగువేరాకు భారతదేశంలో పనేమిటి? అంతకన్నా ముందు, ఆయన ఎవరో సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. చేగువేరా 1928 జూన్‌  14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించారు.

చే బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేశాడు! వైద్య విద్యార్థిగా వున్నప్పుడే లాటిన్‌ అమెరికా మొత్తం పర్యటించాలని చే మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్‌  అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని చే కూడా ఊహించలేదు. 

ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను చే కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్‌  అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్‌ పట్టా చేతికొచ్చిన చేగువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి.. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు.

తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి, క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంత బాటిస్టాపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత  క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. ఇక ఆయన ఇండియా ఎందుకు వచ్చారంటే.. క్యాస్ట్రో పంపించారు. బాండుంగ్‌ ఒప్పందంలో ఉన్న దేశాలన్నిటినీ చేగువేరాని పర్యటించి రమ్మన్నారు. బాండుంగ్‌ అనేది ఇండోనేషియాలోని పట్టణం.

వలస పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఆఫ్రో–ఏషియన్‌ దేశాలన్నీ బాండుంగ్‌లో సమావేశమై.. సమైక్యంగా ఉండాలని, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. అందుకే చేగువేరా ఇండియా వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారు. కలకత్తా కూడా సందర్శించారు. 39 ఏళ్ల వయసులో 1967 అక్టోబర్‌ 9న  ఈ విప్లవ వీరుడు, గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన యోధుడు మరణించారు. బొలీవియా సైన్యం అతడిని పట్టి బంధించి, చంపేసింది. 

మరిన్ని వార్తలు