శతమానం భారతి: జల సంరక్షణ

17 Jul, 2022 15:36 IST|Sakshi

‘ఆహార భద్రత’ అనే మాటలా తాగునీటి భద్రత అనే మాట ప్రాచు ర్యంలో లేకపోవచ్చు. కానీ అందరికీ ఆహారం, ఆరోగ్యం అన్నట్లే.. అందరికీ తాగునీరు అవసరం. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వేసుకున్న పంచవర్ష ప్రణాళికల్లో సురక్షిత తాగునీటికి తగిన ప్రాధాన్యమే లభించింది. 1949 భోర్‌ కమిటీ సూచనల ప్రకారమైతే మన పాలకులు 1990 నాటికి దేశంలోని జనాభా మొత్తానికీ సురక్షిత తాగునీటిని అందించాలి. ఆ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకున్నా.. లక్ష్య శుద్ధితో మాత్రం ప్రభుత్వాలు పని చేశాయి.

భోర్‌ కమిటీ సూచన పాటింపులో భాగంగా 1969లో యునిసెఫ్‌ సాంకేతిక సహాయంతో నాటి ప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాత మూడేళ్లకు 1972లో సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకం మొదలైంది. నీటి కొరత ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ పథకాన్ని అమలు చేశారు. ఆ వరుసలోనే 1987లో తొలి జాతీయ నీటి విధానానికి రూపకల్పన జరిగింది. 1991లో రాజీవ్‌గాంధీ జాతీయ తాగునీటి మిషన్‌ ఆరంభమైంది.

2002లో పౌర భాగస్వామ్యం ప్రాతిపదికన ‘స్వజలధార’ పథకం ప్రారంభం కాగా, 2005లో ‘భారత్‌ నిర్మాణ్‌’ కార్యక్రమం నీటి సరఫరా లేని ప్రాంతాలకు ఐదేళ్లలో తాగునీటి అందించాలని సంకల్పించుకుంది. ఏ ప్రణాళిక అయినా పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వడం అనేది ప్రభుత్వం పైనే కాక, ప్రజల పైనా ఆధారపడి ఉంటుంది. నీరు అనే అమృతాన్ని భావి తరాలకు భద్రపరిచి మిగిల్చాలన్న ప్రతినను ఈ అమృతోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలి.  

(చదవండి: జైహింద్‌ స్పెషల్‌: వాంటెడ్‌ సూర్యసేన్‌)

మరిన్ని వార్తలు