పెనంలోంచి  పొయ్యిలోకి పడిన రోజు!

2 Aug, 2022 18:52 IST|Sakshi

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1858 ఆగస్టు 2 గురించి భారతీయులు ఇప్పటికీ ఈ మాటే అనుకుంటారు! ఆ ముందు ఏడాదే దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎవరి మీద తిరుగుబాటు అంటే.. ఆప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న ‘బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ’ మీద. పాలిస్తే బ్రిటన్‌ పార్లమెంటు పాలించాలి గానీ, వ్యాపారం చేసుకోడానికి ఇండియా వచ్చిన బ్రిటన్‌ కంపెనీ (ఈస్టిండియా) పాలించడం ఏంటి? ఏంటంటే.. పాలించుకొమ్మని బ్రిటన్‌ పార్లమెంటే ఈస్టిండియా కంపెనీకి ఆమోదముద్ర వేసింది!

అప్పట్నుంచీ ఇండియాలో ఈస్టిండియాది ఇష్టారాజ్యం అయిపోయింది. సిపాయిల తిరుగుబాటు మొదలయ్యాక, ఇక అది ఆగదని బ్రిటన్‌ ప్రభుత్వం గ్రహించి భారత పాలనా పగ్గాలను ఈస్టిండియా కంపెనీ నుంచి లాగేసుకుంది. అలా అలాగేసుకుని, తను తీసేసుకున్న రోజే ఆగస్టు 2. అంటే ఈస్టిండియా కంపెనీ అనే పెనంలోంచి, బ్రిటన్‌ అనే పొయ్యిలోకి భారతీయులు వచ్చిపడ్డారు. ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1858’ అనే చట్టం ద్వారా ఈ అధికార సంక్రమణ జరిగింది. 

విజ్ఞాన ఘనుడు
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్‌ బెంగాలీ విద్యావేత్త, ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, పారిశ్రామికవేత్త, వితరణశీలి. రసాయనశాస్త్రంలో మొట్టమొదటి భారతీయ పరిశోధనా పాఠశాలను స్థాపించారు. భారతదేశపు మొట్టమొదటి ఔషధ సంస్థ బెంగాల్‌ కెమికల్స్‌ – ఫార్మాస్యూటికల్స్‌ కూడా ఆయన స్థాపించినదే. ‘ఎ హిస్టరీ ఆఫ్‌ హిందూ కెమిస్ట్రీ ఫ్రమ్‌ ది ఎర్లీస్ట్‌ టైమ్స్‌ ఫ్రమ్‌ మిడిల్‌ ఆఫ్‌ సిక్స్‌టీంత్‌ సెంచరీ’ (1902) అనే గ్రంథాన్ని రచించాడు.

భారతీయుల విజ్ఞానం గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఎన్నో వ్యాసాలు రాశారు. నేడు ప్రఫుల్ల చంద్రరాయ్‌ జయంతి. 1861 ఆగస్టు 2 న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఖుల్నా జిల్లా రారూలీ–కటిపర గ్రామంలో ఆయన జన్మించారు. బ్రిటన్‌లో ఆరేళ్లు చదివొచ్చారు. రసాయన, రాజకీయ శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. 1944 జూన్‌ 16న తన 82 ఏళ్ల వయసులో కలకత్తాలో మరణించారు. 

విద్యా చరణుడు
విద్యా చరణ్‌ శుక్లా రాజకీయవేత్త. కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు. తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1966లో ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతల ర్యాలీ లక్ష్యంగా 2013 మే 25 న మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో శుక్లాతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2013 జూన్‌ 11న 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నేడు ఆయన జయంతి. 1929 ఆగస్టు 2న రాయ్‌పూర్‌లో జన్మించారు.  

(చదవండి: చైతన్య భారతి: పతాక యోధుడు.. పింగళి వెంకయ్య)

మరిన్ని వార్తలు