బ్రిటన్‌ మెచ్చిన బలాఢ్యుడు: కోడి రామమూర్తి

3 Aug, 2022 13:29 IST|Sakshi

చైతన్య భారతి 1882–1942

‘కండగలవాడే మనిషోయ్‌’ అన్న గురజాడవారి భావనకి నిలువెత్తు రూపం కోడి రామమూర్తి నాయుడు. ఈ బలాఢ్యుడిని చూసి బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌ కూడా సంబరపడింది. రామమూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో ఆయన విన్యాసాలు మరింత కఠినమైనవి. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు.

అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ఆహ్వానం మేరకు రామమూర్తి పుణె వెళ్లి సర్కస్‌ ప్రదర్శన నిర్వహించారు. రామమూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్‌ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. వైస్రాయ్‌ లార్డ్‌ మింటో కారణంగా రామమూర్తి ఖ్యాతి దేశవ్యాప్తమైందని చెబుతారు.

అంటే 1919–1920 ప్రాంతమన్నమాట. కారును ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతూ రామమూర్తినాయుడు చేసే ప్రదర్శనను మింటో చూశాడు. వైస్రాయ్‌ స్వయంగా కితాబిస్తే ఇంకేముంది? కొన్ని వందల మంది సభ్యులు ఉన్న తన సర్కస్‌ బృందం రామమూర్తి యూరప్‌ ఖండానికి వెళ్లారు. ఇంగ్లండ్‌ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్‌ చక్రవర్తి బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌ ప్రాంగణంలోనే ఈ భారతీయుడి చేత ప్రదర్శన ఏర్పాటు చేయించారు.

ప్యాలెస్‌లో విందు చేసి, సత్కరించి ‘ఇండియన్‌ హెర్క్యులిస్‌’ అన్న బిరుదు ఇచ్చారు. తరువాత ఆసియాలో జపాన్, చైనా, బర్మా దేశాలలో కూడా ఆయన సర్కస్‌ ప్రదర్శించారు. బర్మాలో ఆయన మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే భారతదేశానికి వచ్చేశారు. బహుశా ఈర‡్ష్య వల్ల ఆయనను చంపాలని అక్కడి వాళ్లు అనుకుని ఉండవచ్చు.  సర్కస్‌ ద్వారా ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు గడించారాయన. అందులో చాలా వరకు విరాళాలు ఇచ్చారు.

ముఖ్యంగా భారత స్వాతంత్యోద్య్రమానికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఒంటి నిండా శక్తి. దేశ విదేశాలలో కీర్తి. అయినా రామమూర్తినాయుడు అనే ఆ మల్లయోధుడు జీవిత చరమాంకంలో అనారోగ్యమనే సమస్యతో పోరాడాడు. బహుశా అందులో మాత్రం ఆయన అపజయం పాలయ్యారేమో!  ఆయన ఒరిస్సాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు దాదాపు 1942 జనవరి 16 న అనామకంగా కన్నుమూశారు.

రామమూర్తిగారు పూర్తి శాకాహారి.  గురజాడ వారు తిరగాడిన ఉత్తరాంధ్రలోనే కోడి రామమూర్తి 1882 ఏప్రిల్‌లో జన్మించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం. ఊరి పేరే కాదు, ఆయన ఇంటి పేరుకు కూడా ఒక ఘనత ఉంది. కోడి వంశం మల్లయోధులకు ప్రసిద్ధి. 

మరిన్ని వార్తలు