దండి తర్వాత అంతటి యాత్ర!

3 Jul, 2022 09:03 IST|Sakshi

రైతు రక్షణ యాత్ర 1937 జూలై 3న ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుండి ఆరంభమైంది. అక్కడి నుంచి రైతు గీతాలు ఆలాపిస్తూ , గౌతు లచ్చన్న తదితరులు వెంట రాగా ముందుకు సాగింది. గాంధీజీ నిర్వహించిన దండియాత్రను మినహాయిస్తే, ఇంతటి భారీ ఎత్తున జరిగిన ఘటన మరొకటి లేదని అంటారు! 

జాతీయోద్యమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకొంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు మూడు ఉద్యమాల్లో.. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, చీరాల–పేరాల ప్రతిఘటనోద్యమం, పెదనందిపాడు రైతు ఉద్యమం చెప్పుకోదగ్గవి. వీటితో పాటు 1930 దశకంలో జరిగిన చరిత్రాత్మక రైతు రక్షణ యాత్ర గణనీయమైనది. తొమ్మిది నెలల పాటు కోస్తాంధ్ర ఉత్తర దిక్కు నుండి మద్రాసు వరకు సాగిన ఈ యాత్ర (జూలై 1937–మార్చి 1938) చరిత్రాత్మకమైనది. ఈ యాత్ర పూర్వ రంగంగా 1936లో అఖిల భారత కిసాన్‌ సభ ఏర్పడింది. ఆంధ్రదేశంలో నీటి తీరువా పన్ను హెచ్చింపు, శిస్తు రెమిషన్, రీ సెటిల్‌మెంట్‌ తదితర రైతు సమస్యలపై జిల్లాల వారీ సభలు, సమావేశాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకున్నాయి. 

ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం 1937లో ఏర్పడి, ఆచార్య ఎన్‌.జి.రంగాను అధ్యక్షుడిగా ఎన్నుకొంది. ఆ తర్వాత కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి అధ్యక్షుడు. చలసాని వాసుదేవరావు కార్యదర్శి. అప్పటి నుంచి విస్పష్టమైన రైతాంగ పోరాటాలు మొదలయ్యాయి. గ్రామల్లో రైతు సంఘాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, జిల్లాలవారీ రైతు యాత్రలు జరిగాయి. ఆచార్య రంగా అభిప్రాయంలో ఈ యాత్రలు మద్రాసు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వార్షిక యాత్రలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రముఖ జాతీయ నాయకులు న్యాపతి సుబ్బారావు పంతులు, దండు నారాయణరాజు, మాగంటి బాపినీడు, ఓరుగంటి వెంకట సుబ్బయ్య, పుల్లెల శ్యామసుందరరావు, కల్లూరి సుబ్బారావు ప్రభృతులు ఈ యాత్రలో పాల్గొన్న ముఖ్యుల్లో కొందరు. 

రైతు రక్షణ యాత్ర
ఆంధ్రదేశంలో పెల్లుబికిన రైతాంగ చైతన్యాన్ని ఒక నిర్దుష్ట మార్గంలో పెట్టేందుకు, కోస్తా ప్రాంతంలోని రైతుల్ని ఉద్యమబాట పట్టించేందుకు ఆంధ్ర రైతు రక్షణ యాత్ర తోడ్పడింది. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం లాంటి రైతాంగ సమస్యలపై దృష్టి మరలింది. కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి (కాంగ్రెస్‌) నాయకుడిగా, చలసాని వాసుదేవరావు (కమ్యూనిస్టు పార్టీ) ఉప నాయకుడిగా వ్యవహరించారు. రైతు రక్షణ యాత్ర 1937 జూలై 3న ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుండి ఆరంభమైంది. అక్కడి నుంచి రైతు గీతాలు ఆలాపిస్తూ , గౌతు లచ్చన్న తదితరులు వెంట రాగా ముందుకు సాగింది. 

రైతుల ‘మాగ్నా కార్టా’
ఆంధ్రప్రదేశ్‌లో రైతుయాత్ర 7 జిల్లాలు, 130 రోజులు పర్యటించింది. అప్పట్లోనే 25 వేల మంది సంతకాలు సేకరించింది. ఎనిమిది వందల దరఖాస్తులు, మూడు వందల విజ్ఞాపన పత్రాలు, అరవై ఫిర్కా స్థాయి సభలు, 800ల గ్రామస్థాయి సభలు నిర్వహించి మద్రాసుకు చేరింది. గాంధీజీ నిర్వహించిన దండియాత్రను మినహాయిస్తే, ఇంతటి భారీ ఎత్తున జరిగిన ఘటన మరొకటి లేదని పరిశీలకుల అభిప్రాయం. 

1937 జూలైలో మొదలైన యాత్ర 1938 మార్చి అంతానికి మద్రాసు చేరింది. ప్రభుత్వానికి రైతు నేతలు సుదీర్ఘ సమగ్ర విజ్ఞాపన అందజేశారు. దీన్ని ఆంధ్ర దేశపు రైతుల సుదీర్ఘ, సమగ్ర దర్పణంగా భావించవచ్చు. రైతుల డిమాండ్‌లతో కూడిన ‘మాగ్నాకార్టా’ ఇది. ‘‘భూమిశిస్తు విధానం, ప్రకృతి వైపరీత్యాలు రైతులకు కృంగదీస్తున్నాయి. ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, పోలీసుల దౌర్జన్యం, జమీందారీ, ఇనాందారీ, మొఖాసా గ్రామాల్లో రైతుల స్థితిగతులు నరకప్రాయం. జమీందారుల పెత్తనం హద్దులు మీరింది. ప్రజలు అనారోగ్యం, అవిద్య, అజ్ఞానాలతో తల్లడిల్లిపోతున్నారు.

ప్రజల భాషలో పాలన జరగాలి. వీటి నివారణకు చర్యలు చేపట్టాలి’’.. అంటూ సాగింది. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రజల కడగండ్లు గట్టెక్కుతాయని ఆశించారు. రుణ విమోచన చట్టం, మద్యపాన నిషేధం జరిగి ప్రజల్లో ఆశలు మొలకెత్తాయి. రైతుల్లో అపూర్వ సంచలనం, ఆశాభావం తొణికిసలాడింది. జిల్లా రైతు సభలు విజయవంతమయ్యాయి. టంగుటూరి ప్రకాశం పంతులు (రెవిన్యూ మంత్రి) ఆధ్వర్యంలో జమీందారీ విచారణ కమిటీ ఏర్పడి, అంతిమంగా జమీందారీ విధానం రద్దుకు ఈ యాత్ర నాంది పలికింది.

1948లో జమీందారి విధానం రద్దయింది. నేడు దేశంలో రైతాంగం అనేకానేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా.. దిగుబడులు పెరిగినా, కనీస ధర లేకపోవడం, ప్రభుత్వాలు కొనడానికి ముందుకు రాకపోవడం, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివి మరెన్నో. ఇటీవలి కాలంలో సాగిన రైతు వ్యతిరేక చట్టాల నిరసన మహోద్యమం (హర్యానా, పంజాబ్‌లలో) నేటి రైతాంగ స్థితి గతులకు అద్దం పడుతున్నది. 
– వకుళాభరణం రామకృష్ణ 

(చదవండి: ప్రథమ సంగ్రామ గ్రంథాలు! సిపాయిల తిరుగుబాటు పై వచ్చిన గ్రంథాలు)

మరిన్ని వార్తలు