Vikram Sarabhai Life History: విక్రమ్‌ సారాభాయ్‌

29 Jun, 2022 08:24 IST|Sakshi

అహ్మదాబాద్‌లో సంపన్నులు, జౌళి పారిశ్రామిక వేత్తలు, జైనులు అయిన సారాభాయ్‌ల కుటుంబం మహాత్మాగాంధీకి సన్నిహితమైనది. విక్రమ్‌ సోదరి మృదుల స్వాతంత్య్ర సమరంలో పొల్గొని అనేక పర్యాయాలు జైలుకి వెళ్లారు. వారి కుటుంబానికి చెందిన 21 ఎకరాల స్థలంలోప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న ప్రయోగాత్మక పాఠశాలలో విక్రమ్‌కి, ఆయన ఏడుగురు తోబుట్టువులకు ప్రాథమిక విద్య చెప్పించారు. రవీంద్రనాథ్‌ టాగూర్, జవహర్‌లాల్‌ నెహ్రూ, రుక్మిణీదేవి అరండేల్‌ వంటి విశిష్ట సందర్శకులతో పరిచయాలను కూడా కల్పించేవారు.

సుమారు పదకొండేళ్ల వయసులో విక్రమ్‌ సారాభాయ్‌కి ఇష్టమైన  హాబీ.. వేగంగా సైకిల్‌ తొక్కుతూ, చేతులను ఛాతీ మీద పెట్టుకుని, కాళ్లను హ్యాండిల్‌బార్‌ మీద పెట్టి, సూటిగా ఉన్న రహదారి మీద కళ్లు మూసుకుని, సైకిల్‌ ఎంత దూరం పోతుందో అంత దూరమూ పోనివ్వడం! పనివారు ఆయన్ని వెంటబడి, అలా చేయవద్దని బతిమాలుతూ ఉండేవారు. తరువాతి జీవితకాలంలో 80 కి పైగా శాస్త్రీయ పరిశోధన పత్రాలను సమర్పించి, దాదాపు 40 సంస్థలను స్థాపించి, భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, 1960లలో అణు కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఘనుడు కూడా ఆయనే.స


విక్రమ్‌ బెంగళూరుకు వెళ్లి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో నోబెల్‌ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ వద్ద భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. తరువాత కాలంలో భారత అణు విద్యుత్‌ కార్యక్రమాన్ని నెలకొల్పిన హోమీ భాభాతో అక్కడే విక్రమ్‌కి స్నేహం ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విక్రమ్‌ సారాభాయ్‌ ఫిజికల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీని, భారతదేశపు మొట్టమొదటి జౌళి పరిశోధనా సహకార సంఘమైన అహ్మదాబాద్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీస్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ (ఎ.టి.ఐ.ఆర్‌.ఎ) ని; దేశంలో మొదటి మార్కెటింగ్‌ పరిశోధనా సంస్థ అయిన ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ గ్రూపు; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (అహ్మదాబాద్‌) మొదలుగా ఎన్నెన్నో సంస్థలను స్థాపించారు.

1960లలో అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటానికి ఆలంబనగా నిలచిన అంతరిక్ష కార్యక్రమాన్ని ఒక బడుగు దేశమైన భారతదేశం చేపట్టడం బొత్తిగా అనూహ్యం. కానీ దానిని సుసాధ్యం చేయడమే కాక, కమ్యూనికేషన్‌లు, వాతావరణ అంచనాలు, ఖనిజ నిక్షేపాలను కనుగొనడం వంటి శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్దేశించడం శాస్త్రవేత్తగా ఆయనలోని ప్రగతిశీలతను చాటుతుంది. ఉపగ్రహ బోధనా టెలివిజన్‌ ప్రయోగంలో ఆయన 1975–76లో నాసా ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని 2,400 నిరుపేద గ్రామాలకు పాఠాలను ప్రసారం చేశారు. చిరునవ్వు వీడని ముఖంతో రోజుకు 18 నుంచి 20 గంటల సేపు ఆయన పని చేసేవారు. 1971 డిసెంబర్‌ 30 వ తేదీన కేవలం 52 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.
– అమృతా షా, సారాభాయ్‌ జీవిత చరిత్ర రచయిత్రి 

(చదవండి: మహోజ్వల భారతి: చాణక్య నరసింహ)

మరిన్ని వార్తలు