మహోజ్వల భారతి: ఈస్టిండియా ఉరికి వేలాడిన తొలి భారతీయుడు!

5 Aug, 2022 14:14 IST|Sakshi

ప్లాసీ యుద్ధంలో (1757) బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలా ఓడిపోయాక, తదనంతర పరిణామాల్లో బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ నవాబు దగ్గర పనిచేసే నందకుమార్‌ను బ్రిటిషర్‌లు తమ పాలనా యంత్రాంగం సిబ్బంది విభాగంలోకి తీసుకున్నారు. తర్వాత ఈస్టిండియా కంపెనీ తరఫున బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో పన్నులు వసూలు చేసేందుకు 1764లో ఆయన్ని దివాన్‌గా నియమించారు. నందకుమార్‌కు అప్పటికే ‘మహారాజా’ అనే బిరుదు ఉంది. 17వ మొఘల్‌ చక్రవర్తి షా ఆలమ్‌ ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు. చివరికి ఆ మహారాజు దివాన్‌ అయ్యారు. అంటే ముఖ్య కోశాధికారి. అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వారెన్‌ హేస్టింగ్స్‌ని తొలగించి, నందకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.

అప్పుడు మౌనంగా వెళ్లిపోయిన హేస్టింగ్‌ తిరిగి 1773లో బెంగాల్‌ గవర్నర్‌గా వచ్చారు! మునుపటి కోపం నందకుమార్‌పై అతడికి అలాగే ఉంది. అది చాలదన్నట్లు నందకుమార్‌ అతడిపై అవినీతి ఆరోపణలు చేసి మరింత కోపానికి గురయ్యాడు. అప్పట్లోనే అది పది లక్షల రూపాయల అవినీతి. ఆ ఆరోపణల నుంచి హేస్టింగ్స్‌ తేలిగ్గానే తప్పించుకున్నాడు కానీ, నందకుమార్‌ని అతడు తేలిగ్గా తీసుకోలేదు. 1775లో నందకుమార్‌పై దస్తావేజుల ఫోర్జరీ కేసు పెట్టించి విచారణ జరిపించాడు. ఆ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే నందకుమార్‌కు ఉరిశిక్ష విధించాడు. పది లక్షల అవినీతికి సాక్ష్యాలున్నా హేస్టింగ్‌ దోషి కాలేదు కానీ, ఫోర్జరీ అని హేస్టింగ్‌ చేసిన చిన్న ఆరోపణతో నందకుమార్‌కు ఉరిశిక్ష పడింది. 1775 ఆగస్టు 5న ఆయన్ని ఉరి తీశారు.

ఈస్టిండియా కంపెనీ ఉరిశిక్ష వేయించి చంపిన మొదటి భారతీయుడు నందకుమారే! ఉరి రోజున నందకుమార్‌ను జైలు నుంచి ఉరికొయ్యల దగ్గరకు తీసుకొస్తుంటే ఆయన చిరునవ్వుతో ఉన్నారని ఉరి శిక్ష అమలును పర్యవేక్షించిన కలకత్తా షరీఫ్‌ అలెగ్జాండర్‌ మక్‌రబీ రాశారు.
చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 ముందడుగు

మరిన్ని వార్తలు