Anugrah Narayan Sinha History: అనుగ్రహ నారాయణ్‌ సిన్హా

5 Jul, 2022 12:30 IST|Sakshi

అనుగ్రహ నారాయణ్‌ సిన్హా స్వాతంత్య్ర సమర యోధులు, రాజనీతిజ్ఞులు, గాంధేయవాది. ఆధునిక బిహార్‌ నిర్మాతలలో ఆయన ఒకరు. సిన్హా చంపారన్‌ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బిహారుకు తొలి ఉప ముఖ్యమంత్రి (1937)గా చేశారు. రాజ్యాంగ రచనకు ఏర్పాటైన భారత రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులుగా ఉన్నారు. బాబు సాహెబ్‌ అనే పిలుపుతో ప్రసిద్ధులైన అనుగ్రహ నారాయణ్‌ సిన్హా మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితులు. సిన్హా 1887 జూన్‌ 18 న బిహార్‌లోని పూర్వపు గయ జిల్లా (నేడు ఔరంగాబాద్‌) పోయివాన్‌ గ్రామంలో జన్మించారు. ఆయన రాజపుత్ర వంశానికి చెందినవారు.

న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1917లో మహాత్మా గాంధీ జాతికి  ఇచ్చిన పిలుపును అందుకుని చంపారన్‌ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. అందుకోసం తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు. అనంతరం సిన్హా జాతీయ స్థాయి నాయకుడయ్యారు. ప్రతిభావంతులైన యువకులను చైతన్యపరిచేందుకు డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ స్థాపించిన బిహార్‌ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన మొదటి విద్యార్థులలో యువ జయప్రకాష్‌ నారాయణ్‌ ఒకరు. భారత జాతీయవాద చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించే 1930 నాటి  శాసనోల్లంఘన ఉద్యమంలో సిన్హా.. గాంధీ వెనుక కీలక శక్తిగా పనిచేశారు. పర్యవపానంగా బ్రిటిషు ప్రభుత్వం 1933–34లో ఆయనకు 15 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. తిరిగి 1940–41లో సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు.

అప్పుడు కూడా బ్రిటిషు అధికారులు ఆయనను అరెస్టు చేసి, 1942లో హజారీబాగ్‌ కేంద్ర కారాగారంలో ఉంచారు. 1944లో ఆయన విడుదలయ్యారు. బయటికి వచ్చాక అంటువ్యాధి పీడిత ప్రజలకు సేవ చేయడానికి అంకితమయ్యారు. సిన్హా రాజకీయ జీవితం కూడా ఎంతో విస్తృతమైనది. 1935లో  సహబాద్‌–పాట్నా నియోజకవర్గం నుండి సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా భారీ అధిక్యతతో ఎన్నికయ్యారు. 1936లో బిహార్‌ శాసనసభ సభ్యుడయ్యారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం బ్రిటిషువారు మంజూరు చేసిన ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిలో భాగంగా మొదటి కాంగ్రెస్‌ మంత్రివర్గం 1937 జూలై 20న ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడే సిన్హా బిహార్‌ ఉపముఖ్యమంత్రి అయ్యారు.   స్వతంత్ర భారత తొలి పార్లమెంటులో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. కార్మిక, స్థానిక స్వరిపాలన, ప్రజా పనులు, సరఫరా–ధరల నియంత్రణ, ఆరోగ్యం, వ్యవసాయం వంటి శాఖల్ని నిర్వహించారు. నేడు సిన్హా వర్ధంతి. డెబ్బై ఏళ్ల వయసులో 1957 జూలై 5న ఆయన కన్నుమూశారు.

మరిన్ని వార్తలు