కలం యోధుడు: మున్షీ ప్రేమ్‌చంద్‌ / 1880–1936

9 Jul, 2022 14:10 IST|Sakshi
మున్షీ ప్రేమ్‌చంద్‌

చైతన్య భారతి

గ్రామీణ భారతావనిని పట్టి పీడిస్తున్న దారిద్య్రం, దళితులను దోపిడీ చేయడం, మూఢ నమ్మకాలు, ధార్మిక క్రతువులు, పితృస్వామ్యం, జమీందారీ విధానం, వలసవాదం, మతతత్వం లాంటి అంశాలను ప్రేమ్‌చంద్‌ నిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేశారు. మున్షీ ప్రేమ్‌చంద్‌గా అందరికీ సుపరిచితులైన ధన్పత్‌రాయ్‌ను సామ్యవాద వాస్తవిక రచయితగా పేర్కొనవచ్చు. ప్రేమ్‌చంద్‌ను తరచూ గాంధేయవాది అని పొరపడుతూ ఉంటారు. రచనా జీవితం తొలి రోజుల్లో ఆయన గాంధేయవాద పోకడలు పోయారు. ఏదో మాయ జరిగినట్లుగా దోపిడీదారులందరూ  తాము చేస్తున్న నేరాలను మానేసినట్లు ఆయన రాసేవారు.

కానీ తరువాతి రచనల్లో ఆయన క్రమంగా సామ్యవాద సిద్ధాంతం వైపు మారారు. మరాఠీ రచయిత టి.టికేకర్‌తో సంభాషణ జరిపినప్పుడు ప్రేమ్‌చంద్‌ ఇలా అన్నారు. ‘‘నేను ఓ కమ్యూనిస్టుని. అయితే నా కమ్యూనిజమల్లా రైతులపై దౌర్జన్యం చేసే జమీందార్లను, సేనలనూ, ఇతరులను లేకుండా చేయడం వరకే పరిమితం’’ అని. అలాగే భారత జాతీయోద్యమం పట్ల ప్రేమ్‌చంద్‌ వైఖరి విమర్శనాత్మకంగా సాగింది. ఆయన దానిని గుడ్డిగా పొగిడేవారు కాదు. తవన్‌ (1931), ఆహుతి (1930) లాంటి కథానికల్లో జాతీయవాదాన్ని ఆయన ఆకర్షణీయంగా, ప్రేరణాత్మకంగా చిత్రించారు. ఆ తరువాత రంగ్‌భూమి (1925), కర్మభూమి (1932) లాంటి నవలల్లో ఈ సైద్ధాంతిక ‘ముఖతలం వెనుక ఉన్న మలిన’ వాస్తవాన్ని ఆయన బహిర్గతం చేశారు. ప్రముఖ విమర్శకులు సుధీర్‌ చంద్ర ఈ విషయాలు తెలిపారు.

ఆధిపత్య వర్గం నుంచి తమ వర్గ ప్రయోజనాలను ప్రచారం చేసుకోవడం కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకోవడాన్ని ప్రేమ్‌చంద్‌ మున్షీ విమర్శించారు. స్త్రీవాద దృక్కోణం నుంచి ప్రేమ్‌చంద్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇక వలసవాద భారతదేశంలోని లోబరుచుకొనే శక్తులపై ఆయన కథానికలు తీవ్రంగా దాడి చేస్తే, ఆయన రాసిన ‘గోదాన్‌’, ‘గబన్‌’, ‘నిర్మల’ వంటి నవలలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. సమాజంలోని అన్యాయాలపై ఆయన సూటిగా, నిర్మొహమాటంగా తన రచనల్లో విరుచుకుపడ్డారు. ఆయన రచనల్లో కొన్ని.. ఘాటైన విమర్శలకు  గురైనప్పటికీ ఆయనను అనుకరించే రచయితలు పలువురు రంగ ప్రవేశం చేశారు. ఆయన రచనలు పాఠకులకే కాక, సాటి రచయితలకు కూడా ప్రేరణగా నిలిచాయంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.
 
– మేఘా అన్వర్, ఢిల్లీ లేడీ శ్రీరామ్‌ కళాశాలలో బోధకులు

మరిన్ని వార్తలు