నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్‌లోని పహార్తలి యూరోపియన్‌ క్లబ్‌... ప్రీతిలతా వడ్డేదార్‌

18 Jul, 2022 13:27 IST|Sakshi

పహార్తలి యూరోపియన్‌  క్లబ్‌ ముందు బ్రిటిషర్‌లు ‘‘కుక్కలకు, భారతీయులకు అనుమతి లేదు’’ అని అత్యంత అవమానకర రీతిలో ఒక బోర్డు పెట్టారు. దీంతో ఈ క్లబ్బుపై దాడి చేయాలని సేన్‌  బృందం నిర్ణయించుకుంది. ఈ దాడికి ప్రీతి నాయకత్వం వహించారు. ‘‘సోదరీమణులకు ఒక విన్నపం! ఇకపై తెరచాటున ఉండకూడదని మహిళలు బలమైన నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి స్వాతంత్య్రం కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మగవారితో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. నన్ను నేను ధైర్యంగా విప్లవకారిణిగా ప్రకటించుకుంటున్నాను. అలాగే మిగతావారు కూడా..’’  

ఒక మహిళా విప్లవకారిణి మృతదేహానికున్న దుస్తుల్లో ఈ మాటలున్న పాంపెట్లను చూసి బ్రిటిష్‌ బలగాలు బెంబేలెత్తాయి. బెంగాల్‌ తొలి మహిళా అమరురాలుగా చరిత్రకెక్కిన ప్రీతీలాల్‌ వడ్డేదార్‌ స్వయంగా రాసిన పాంపెట్లవి! తూటాల్లాంటి మాటలతో పాటు, స్వయంగా తూటాలు కురిపిస్తూ బ్రిటిషర్లతో యుద్ధం చేస్తూ దేశం కోసం ప్రీతి అశువులు బాసారు.

చిన్న వయసులోనే..!
చిట్టగాంగ్‌లో 1911 మే 5న ప్రీతీలాల్‌ వడ్డేదార్‌ జన్మించారు. తండ్రి జగబంధు చిట్టగాంగ్‌ మున్సిపాలిటీలో క్లర్కుగా పనిచేసేవారు. చిన్నప్పుడు ప్రీతిని ముద్దుగా రాణి అనేవారు. కస్తాగిర్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రీతి చదివే రోజుల్లో ఉషా దీ అనే టీచరు పిల్లలకు జాతీయ భావాలను బోధించేవారు. ఉషా బోధనలతో ప్రీతి చిన్నవయసు నుంచే వలసపాలనపై వ్యతిరేకత పెంచుకున్నారు. చదువుకునే రోజుల్లో విప్లవ సాహిత్యం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రీతి ఆదర్శంగా భావించేవారు. మహిళలు పెద్ద సంఖ్యలో కష్టాలను ఓర్చుకుంటూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం ప్రీతిని కదిలించింది.

1929లో ప్రీతి ఢాకాలోని ఈడెన్‌  కాలేజీలో చేరారు. కాలేజీలో ఆమె దీపాలి సంఘ అనే విప్లవ బృందంలో సభ్యురాలయ్యారు. ఈ బృందంలో మహిళలకు యుద్ధ పోరాటరీతులను, రాజకీయ అంశాలను బోధించేవారు. అనంతరం కలకత్తాలోని బెథూన్‌  కాలేజీలో ప్రీతి ఉన్నత విద్యనభ్యసించారు. ఫిలాసఫీలో ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అయితే ఆ కాలంలో ఆమె విప్లవ భావాలను వ్యతిరేకించిన బ్రిటిష్‌ అధికారులు ఆమె డిగ్రీ పట్టాను నిలిపివేశారు. ఉన్నతవిద్య అనంతరం చిట్టగాంగ్‌లోని నందకన్నన్‌  అపర్ణాచరణ్‌ స్కూల్‌లో ఆమె టీచర్‌గా చేరారు. ఈ సమయంలోనే ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

సూర్యసేన్‌  పరిచయం
ప్రీతి విప్లవభావాల గురించి విన్న ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు సూర్యసేన్‌  ఆమెను తన బృందంలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆమె సూర్యసేన్‌ ను ధాల్‌ఘాట్‌ క్యాంపులో కలిశారు. మహిళలను విప్లవ బృందంలో చేర్చడాన్ని తోటి విప్లవకారుడు బినోద్‌ బిహారీ వ్యతిరేకించారు. అయితే మహిళలు సులభంగా విప్లవ బృందాలకు కావాల్సిన ఆయుధాలను రవాణా చేయగలరన్న కారణంతో కఠిన శిక్షణ అనంతరం చివరకు ప్రీతిని బృందంలో చేర్చుకున్నారు.

చిట్టగాంగ్‌ ఐజీ క్రెగ్‌ను హతమార్చేందుకు సూర్యసేన్‌  నిర్ణయించుకొని ఆ పనిని రామకృష్ణ బిశ్వాస్, కలిపాద చక్రవర్తికి అప్పగించారు. అయితే వీరిద్దరు క్రెగ్‌ బదులు వేరే అధికారులను హత్యచేసి 1931లో పట్టుబడ్డారు. బిశ్వాస్‌ను జైల్లో కలిసిన ప్రీతి ఆయన బోధనలతో స్ఫూర్తి పొందారు. అనంతరం సేన్‌ తో కలిసి ఆయన బృందంలో భాగంగా ప్రీతి పలు సాయుధ దాడుల్లో పాల్గొన్నారు. 1930 చిట్టగాంగ్‌ దాడి అనంతరం బృందంలో మగవారిపై నిఘా ఎక్కువ కావడంతో మహిళానేతలు చురుగ్గా విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 

పహార్తలి క్లబ్‌ ఘటన
జలియన్‌  వాలాబాగ్‌ దురంతం అనంతరం దేశవ్యాప్తంగా సమర వీరుల రక్తం మరిగిపోయింది. ఇదే సమయంలో స్థానిక పహార్తలి యూరోపియన​  క్లబ్‌ ముందు బ్రిటిషర్‌లు ‘‘కుక్కలకు, భారతీయులకు అనుమతి లేదు’’ అని అత్యంత అవమానకర రీతిలో ఒక బోర్డు పెట్టారు. దీంతో ఈ క్లబ్బుపై దాడి చేయాలని సేన్‌  బృందం నిర్ణయించుకుంది. ఈ దాడికి ప్రీతి నాయకత్వం వహించారు. 1932 సెప్టెంబర్‌లో ఆమె పంజాబీ మగమనిషిలా దుస్తులు ధరించి, విప్లవకారులతో కలిసి క్లబ్‌లోకి వెళ్లి క్లబ్బును పూర్తిగా ధ్వంసం చేశారు.

 ఆ సమయంలో క్లబ్బులో ఉన్న పోలీసులు కాల్పులు జరపడంతో ప్రీతి కాలికి బుల్లెట్‌ తగిలి పారిపోయే వీలు చిక్కలేదు. దీంతో పోలీసుల చేతికి చిక్కకూడదన్న దృఢ నిశ్చయంతో ఆమె సైనేడ్‌ గుళిక మింగి అమరురాలయ్యారు. ఈ ఘటన జరిగే నాటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలే! ప్రీతి ఆత్మత్యాగం దేశీయ మహిళా లోకంలో కలకలం సృష్టించింది. ఆమె స్ఫూర్తితో అనేకమంది స్త్రీలు కులమతాలకు అతీతంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ప్రీతి మహిళలకు ఆదర్శప్రాయమని బంగ్లా రచయిత్రి సెలినా హుస్సేన్‌  ప్రస్తుతించారు.
– దుర్గరాజు శాయి ప్రమోద్‌ 

(చదవండి: స్వతంత్ర భారతి:1993/2022 స్టాక్‌ మార్కెట్‌లోకి ఇన్ఫోటెక్‌ )

మరిన్ని వార్తలు