భయంకర వెంకటాచారి: గాంధీమార్గం వీడి బాంబులతో జోడీ

10 Aug, 2022 13:47 IST|Sakshi

జైహింద్‌ స్పెషల్‌

గాంధీ– ఇర్విన్‌ ఒప్పందంలో భాగంగా ఖైదీల విడుదల జరిగినప్పుడు భయంకర్‌ కూడా విడుదలయ్యారు. ఈ ఘటన అనంతరం ఆయన భావజాలంలో మార్పు వచ్చింది. కేవలం విప్లవం ద్వారా మాత్రమే సంపూర్ణ స్వతంత్రం సిద్ధిస్తుందని ఆయన భావించారు.

పేరులో మాత్రమే కాదు చర్యలతో కూడా వలసపాలకులకు దడ పుట్టించిన పోరాట యోధుడు భయంకర వెంకటాచార్యులు. బ్రిటిష్‌వారి తొత్తులుగా పనిచేసే స్థానిక అధికారులను మట్టుబెట్టి తద్వారా వారిలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించిన వ్యక్తి. కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధి గాంచిన కేసులో ప్రథమ ముద్దాయి. విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారిని స్థానికులు ఆంధ్రా భగత్‌ సింగ్‌ అనేవారు. 

సాహో లాహోర్‌
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1910లో జన్మించిన భయంకరాచారి పదో తరగతి వరకు అక్కడే చదివారు. అనంతరం విశాఖలో చదువు కొనసాగించారు. చదువుకునే రోజుల్లోనే ఆయన లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు. గురజానపల్లిలో ఆయన ఉప్పు సత్యాగ్రహం నిర్వహిస్తుండగా అరెస్టయి జైలుకు వెళ్లారు.

గాంధీ– ఇర్విన్‌ ఒప్పందంలో భాగంగా ఖైదీల విడుదల జరిగినప్పుడు ఆయన కూడా విడుదలయ్యారు. ఈ ఘటన అనంతరం ఆయన భావజాలంలో మార్పు వచ్చింది. కేవలం విప్లవం ద్వారా మాత్రమే సంపూర్ణ స్వతంత్రం సిద్ధిస్తుందని ఆయన భావించారు. ఇందుకోసం బ్రిటిష్‌ ప్రభుత్వం కింద పనిచేస్తూ స్వదేశీయులపై దమనకాండ జరిపే అధికారులను మట్టుబెట్టాలని ఆలోచన చేశారు. దీనివల్ల బ్రిటిషర్‌లకు స్థానికాధికారుల సాయం తగ్గుతుందని భావించారు.

డీఎస్పీకి ముహూర్తం!
ఆ సమయంలో కాకినాడలో ముస్తఫా ఆలీ ఖాన్‌ డీఎస్‌పీగా పనిచేస్తుండేవాడు. ఆయన కింద డప్పుల సుబ్బారావనే సీఐ ఉండేవాడు. వారిద్దరూ స్వతంత్ర సమర యోధుల పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించేవారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని భయంకరాచార్యులు నిర్ణయించుకున్నారు. కామేశ్వర శాస్త్రి తదితరులు ఆయనకు సహకరించేందుకు అంగీకరించారు. వీరంతా కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరి నుంచి బాంబు తయారీ సామగ్రిని తెప్పించి తమ ప్రణాళికను కొనసాగించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యక్షేత్రంగా ఉండేందుకు గాను సి.హెచ్‌.ఎన్‌.చారి అండ్‌ సన్స్‌ అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే 1933 ఏప్రిల్‌ 6, 14 తేదీలలో చేసిన వీరి యత్నాలు రెండూ విఫలమయ్యాయి. అనంతరం ఏప్రిల్‌ 15న మూడో ప్రయత్నానికి వీరంతా సిద్ధమయ్యారు. 

కాకినాడలో కాపుగాసి
1933 ఏప్రిల్‌ 15న ముస్తఫా కాకినాడ వస్తాడని తెలుసుకొన్న భయంకరాచార్యుల బృందం బాంబులు తయారుచేసుకొని పోర్టులో మాటు వేసారు. కానీ మూడోసారి కూడా ముస్తఫా అటు వైపు రాలేదు. దీంతో ఈదఫా ముస్తఫాను చంపకుండా ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకొని, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి, దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్లారు. వీళ్లు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తక్షణం దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్‌.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం పోలీసులకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. 

అండమాన్‌లో ఏడేళ్లు
అనంతరం పోలీసులు కుట్రలో పాల్గొన్న వారిని ఒక్కొక్కర్ని పట్టుకున్నారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 11 న భయంకరాచారిని ఖాజీపేట్‌ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. డిసెంబరు 1933 నుండి ఏప్రిల్‌ 1934 వరకు తూర్పు గోదావరి జిల్లా సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మంది కుట్రదారులకు వేరువేరు శిక్షలు విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచార్యులు, కామేశ్వరశాస్త్రిలను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురినీ అప్పటికే వారు గడిపిన రెండేళ్ల శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది.

భయంకరాచారికి ఏడేళ్ల జైలుశిక్షను విధించి, అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ల శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక ఆయన ‘క్రైగ్స్‌ పారడైజ్‌’ అని అండమా¯Œ లో దుర్భర పరిస్థితులను వర్ణిస్తూ పుస్తకం రాశారు. తర్వాత రోజుల్లో ఆయన ప్రకాశం పంతులుగారికి మద్దతుదారుగా మారారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో ఉద్యోగం చేశారు. 1978లో మరణించారు. 
– దుర్గరాజు శాయి ప్రమోద్‌

మరిన్ని వార్తలు