గుజరాత్‌ అల్లర్లు

26 Jul, 2022 09:40 IST|Sakshi

గుజరాత్‌లోని గోధ్ర రైల్వే స్టేషన్‌ సమీపంలో సబర్బతీ ఎక్స్‌ప్రెస్‌ రైలు దహనమై 59 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలం వద్దకు కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులే ఆ ఘటనలో అత్యధికంగా ఉన్న మృతులు. 2002 ఫిబ్రవరి 27న ఈ దారుణమైన ఘటన జరిగింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కమిషన్‌ను నియమించింది.

ఆరేళ్ల దర్యాప్తు తర్వాత వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ఉన్న మూక ఈ దహనకాండకు పాల్పడినట్లు కమిషన్‌ వెల్లడించింది. గోధ్ర ఘటన అనంతరం గుజరాత్‌లో మతకలహాలు చెలరేగాయి. గోధ్రలో జరిగిన దానికి పర్యవసానంగా అహ్మదాబాద్‌లో హింసాకాండ కార్చిచ్చులా వ్యాపించింది. మొదటి కొద్ది గంటల్లో ఒక వర్గంపై ఇంకో వర్గం ప్రతీకారాగ్నితో విరుచుకుపడింది. తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆ మతకలహాల మారణకాండలో ఇరు వర్గాలకు చెందిన నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా.

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • 2,800 కి.మీ. పాకిస్థాన్‌ సరిహద్దు పొడవునా మందు పాతరలు అమర్చుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటన.
  • హెలికాప్టర్‌ కూలి లోక్‌సభ స్పీకర్‌ గంటి మోహనచంద్ర బాలయోగి దుర్మరణం.
  •  భారత వైమానిక దళంలోకి సుఖోయ్‌ 30 ఎం.ఎ.ఐ. యుద్ధ విమానం. 

(చదవండి: ఫూలన్‌దేవి హత్య 25 జూలై 2001)

మరిన్ని వార్తలు