శతమానం భారతి: రైతుకు ధీమా

23 Jul, 2022 10:05 IST|Sakshi

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల నాటికి.. అంటే ఈ ఏడాది నాటికి.. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2015 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కమతాల పరిమాణం తగ్గిపోవడం, పంట దిగుబడి స్వల్పంగా ఉండటం, రైతుల రుణాలు పెరిగిపోవడం, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయలేక పోవడం అనే ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల అన్నదాతకు అప్పులు, తిప్పలు తప్పడం లేదు. రైతులకు రెట్టింపు ఆదాయాన్నిచ్చే ప్రణాళికలను, పథకాలను ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ వాటి అమలులో అధికారుల చిత్తశుద్ధి లోపించడం వల్ల రైతులు దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోతూనే ఉన్నారు.

స్వాతంత్య్రానంతరం ఈ 75 ఏళ్లలో భారతదేశం అనేక రంగాల్లో  ప్రగతిని సాధించింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అయితే ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న వ్యవసాయ రంగం మాత్రం శక్తిహీనంగానే మనుగడ సాగిస్తోంది. హరిత విప్లవంతో గణనీమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ అటువంటి ప్రయత్నమేదీ జరగలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, యువ రైతులు పట్టణాలకు వలసపోతున్నారు.

చివరికి సేద్యమే నిష్ప్రయోజనం అన్న భావన కూడా మొదలైంది. ఈ స్థితిలో వ్యవసాయ రంగానికి జవజీవాలను ఇచ్చేందుకు 2007లో ప్రొఫెసర్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. రైతులు ఏ రూపేణా ఇబ్బందులు పడకుండా చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయి ఉండాలన్నది కమిటీ చేసిన సూచనల్లో ప్రధానమైనది. నిజమే కదా. సాగు ఇక్కట్ల నుంచి బయట పడటం కన్నా రైతు జీవితానికి రెట్టింపు ఆదాయం ఏముంటుంది? 

(చదవండి: బేగం అఖ్తర్‌ / 1914–1974 : నిజమైన సూఫీ)

మరిన్ని వార్తలు