History Of Dalai Lama In Telugu: ఇండియాకు దలైలామా

13 Jun, 2022 13:19 IST|Sakshi

1959 టిబెటన్‌ తిరుగుబాటు ప్రారంభంలో తమ ప్రాణాలను కాపాడుకోడానికి దలైలామా, ఆయన పరివారం ఆ ఏడాది మార్చి 30 న భారతదేశంలోకి ప్రవేశించి, ఏప్రిల్‌ 18న అస్సాంలోని తేజ్‌పూర్‌కు చేరుకున్నారు. నాటి నుంచీ దలైలామా ఇండియాలో ఉంటున్నారు. గుజరాత్‌లో 2010లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ బుద్ధిస్ట్‌ కాన్ఫరెన్స్‌’లో ఆయన మాట్లాడుతూ... ‘పైకి కనిపిస్తున్న నా రూపం టిబెట్‌ది, ఆధ్యాత్మికంగా నేను భారతీయుడిని, భారతమాత పుత్రుడిని’ అన్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్‌ పురస్కార గ్రహీతలలో 14వ దలైలామా ఒకరు. శాంతి, అహింసా మార్గంలో టిబెట్‌ దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు అర్ధ శతాబ్దం పైగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈయనకు ఈ బహుమతిని ప్రదానం చేశారు.

దలైలామా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి శాంతి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్‌గా పిలిచేవారు. ఆయన టిబెట్‌ దేశం ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్‌ సేర్‌’ అనే కుగ్రామంలో 1935వ సంవత్సరం జూలై ఆరవ తేదీన జన్మించారు. ఆయన రెండున్నర సంవత్సరాల వయస్సులోనే బుద్ధుని అవతారంగా గుర్తింపు పొందారు. ‘లామో ధోండ్రబ్‌’ను బుద్ధుని అంశగా గుర్తించడంతో పాటు తన వారసునిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా. లామో ధోండ్రబ్‌ (నేటి దలైలామా) పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్‌ పరిపాలన వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు.

అయితే 1954వ సంవత్సరంలో టిబెట్‌ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం చైనా హస్తగతం అయింది. ఆ దశలో టిబెట్‌ పరిరక్షణ కోసం దలైలామా... మావోసేటుంగ్, చౌ ఎన్‌ లై మొదలైన నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ అజ్ఞాత ప్రదేశం... భారతదేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ధర్మశాల. భారతదేశంలో ఆశ్రయం పొంది ‘ధర్మశాల’లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్‌ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా. ఆయన ఒక సందర్భంలో... తన శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. నోబెల్‌ బహుమతి అందుకునే సమయంలో దలైలామా ‘‘నోబెల్‌ శాంతి పురస్కారానికి ఒక పీడిత ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వాతంత్య్రం కోసం పోరాడేవారికి, అణగదొక్కబడే వారికి... ప్రపంచ శాంతి కోసం పాటుపడే వారికీ ఈ బహుమతి అంకితం’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు