శతమానం భారతి విదేశీ వాణిజ్యం

20 Jun, 2022 08:38 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సందర్భంలోనైనా అనే మాట ఒకటి ఉంది :  స్వావలంబన మాత్రమే కాదు, అంతకు మించి దేశం ఎదగాలి అని. అంతర్థాం ఏమంటే మన ఉత్పత్తులపై విదేశాలను ఆధారపడేలా చేయడం. తద్వారా విదేశీ మారక నిల్వల్ని పెంచుకుంటూ పోవడం. అప్పుడు దేశం ఆర్థికంగా ఆగ్రరాజ్యం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు అయ్యేనాటికి దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధిగా ఉండాలని ప్రధాని ఆకాంక్ష.

విదేశీ వాణిజ్య రంగంలో ఆ ఆకాంక్ష నేరవేరడం అలవిమాలని లక్ష్యం అయితే కాబోదని పాత గణాంకాలను చూస్తే తేటతెల్లం అవుతుంది. మొదటి పంచవర్ష ప్రణాళికలోని ఐదేళ్లలో మన ఎగుమతుల సగటు విలువ 647 కోట్ల రూపాయలు ఉండగా, 2022 నాటికి ఆ మొత్తం 32 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. భారత్‌ నుంచి పలు రకాలైన ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలలో అమెరికా, చైనా, యూ.ఎ.ఇ. హాంకాంగ్, బంగ్లాదేశ్, సింగపూర్, యు.కె. జర్మనీ, నేపాల్, నెదర్లాండ్‌ ఉన్నాయి. ఈ వరుస క్రమంలో అమెరికా మనకున్న పెద్ద దిగుమతి దారు.

ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు మన ప్రధాన ఎగుమతులు కాగా, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వస్త్రాలు, అభరణాలు, చేనేత, రెడీమేడ్‌ దుస్తులు, ప్లాస్టిక్స్, సముద్ర ఉత్పత్తులు.. మిగతావి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభం అయిన 1991 నాటికి భారత్‌ ఎగుమతులు 1800 కోట్ల డాలర్లు కాగా.. ఈ విలువ లక్ష కోట్ల డాలర్లకు పెరిగితేనే, భారత్‌ తను నిర్దేశించుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోగలదు. 

(చదవండి: శతమానం భారతి : బ్రిటిష్‌ ఇండియాలో తొలి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఐ.ఐ.టి. రూర్కీ)

మరిన్ని వార్తలు