శతమానం భారతి: ఆహార భద్రత

11 Jun, 2022 12:35 IST|Sakshi

స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఉప్పులకు, ఉప్పులకు కొత్త సంసారంలా ఉండేది ఇండియాకు! నాటి జనాభా 35 కోట్లే అయినా తిండికి తిప్పలు అన్నట్లుగా ఉండేది. దిగుమతులే శరణ్యం అన్నట్లుగా గడిచింది. నాలుగేళ్లలో కాస్త నిలదొక్కుకున్నాక అయిదు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను సొంతంగా ఉత్పత్తి చేసుకోగలిగాం. ఇప్పటికి ఆ మొత్తం ఐదు రెట్లకు పెరిగింది. సమానంగా జనాభా కూడా పెరిగి 140 కోట్లకు చేరుకోబోతున్నాం. అందుకే ఇప్పుడు మన దేశానికి ఆహార భద్రత అవసరమైంది. భద్రత అంటే ఏం లేదు. కరువు దాపురించకుండా జాగ్రత్త పడటం.

పంటల దిగుబడులను పెంచుకోవడం తోపాటు, నిల్వ సదుపాయాలను సమకూర్చుకోవడం. దేశంలోని జనాభాకు ఆహారం కొరత లేకుండా చూడటం. వీటిల్లో నిల్వ దశ ముఖ్యమైనది. ఇందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. జనపనార సంచుల్లో నింపిన ఆహార ధాన్యాలను గట్టి సీలింగు ఉన్న గోదాములలో బస్తాలుగా సర్దడం. ఎల్తైన ట్యూబుల్లాంటి అత్యాధునిక గిడ్డంగులలో ధాన్యాన్ని నిల్వ చేయడం. ఆరు బయట ప్లాస్టిక్‌ కవర్ల కింది బస్తాలుగా పేర్చి నిల్వ చేయడం. పొడవాటి గొట్టాల రూపంలో ఉండే ప్లాస్టిక్‌ సంచుల్లో ధాన్యాన్ని నిల్వ చేయడం. ఏదేమైనా.. సంపాదిస్తే సరిపోదు. దాచుకోవడం తెలియాలి అని ఆర్థిక నిపుణులు అంటుంటారు. అలాగే ఆహార నిపుణులూ.. ‘‘ధాన్యం దిగుబడులు పెంచుకున్నంత మాత్రాన సరిపోదు, వాటిని భద్రపరుచుకుని పేదలకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వం చేయవలసి పని’’ అని సూచిస్తునాన్నారు. వచ్చే 25 ఏళ్లల్లో ఒక లక్ష్యంతో.. మరింత అత్యాధునికమైన నిల్వ విధానాలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు