చైతన్య భారతి: ‘గాంధీ’కి ఆస్కార్‌ డిజైనర్‌ భాను అథియా

5 Aug, 2022 14:26 IST|Sakshi

1929–2020

భాను అథియా పూర్తి పేరు భానుమతి అన్నాసాహెబ్‌ రాజోపాధ్యాయ. నైపుణ్యం గల భారతీయ దుస్తుల రూపకర్త ఆమె. 100 చిత్రాలకు పైగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశారు. భారతీయ చలన చిత్ర నిర్మాతలైన గురుదత్, యష్‌ చోప్రా, బి.ఆర్‌.చోప్రా, రాజ్‌కపూర్, విజయ్‌ ఆనంద్, రాజ్‌ ఖోస్లా, అశుతోష్‌ గోవారికర్‌; అంతర్జాతీయ దర్శకులు కాన్రాడ్‌ రూక్స్‌.. ఇంకా రిచర్డ్‌ అటెన్‌ బరో చిత్రాలకు ఆమె కాస్టూమ్స్‌ అందించారు.

1983లో తెరకెక్కిన ‘గాంధీ’ సినిమాకు ‘బెస్ట్‌ కాస్టూమ్స్‌ డిజైన్‌’ విభాగంలో ఆమెకు ఆస్కార్‌ అవార్డు లభించింది. అథియ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించారు. అన్నాసాహెబ్, శాంతాబాయి రాజోపాధ్యాయ్‌ దంపతులకు జన్మించిన ఏడుగురిలో ఆమె మూడవ సంతానం.  అథియ తండ్రి అన్నాసాహెబ్‌  చిత్రకారుడు. ప్రముఖ సినీ నిర్మాత బాబూరావ్‌ పెయింటర్‌ దగ్గర పనిచేసేవారు.

ఆమె తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన మరణించారు. అథియ ముంబైలోని సర్‌ జె.జె. స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో చదువుకున్నారు. అక్కడే 1951లో తన ‘లేడీ ఇన్‌ రెపోజ్‌’ (విశ్రాంతిలో ఉన్న మహిళ) చిత్రానికి ‘ఉషా దేశ్‌ముఖ్‌ మెడల్‌’ గెలుచుకున్నారు. కాలేజ్‌ నుంచి బయటికి వచ్చాక, ‘ఈవ్స్‌ వీక్లీ’ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్‌ ఫ్యాషన్‌ ఇలస్ట్రేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఈవ్స్‌ వీక్లీ ఎడిటర్‌ ఒక బొటిక్‌ ను తెరిచినప్పుడు, ‘నువ్వెందుకు వస్త్రాలను డిజైన్‌ చేయకూడదు?’’ అని అథియాను ప్రోత్సహించారు.  ఆ సందర్భంలోనే ఆమె దుస్తుల రూపకల్పనలో తన నైపుణ్యాన్ని తెలుసుకోగలిగారు.

దుస్తుల డిజైనర్‌గా ఆమె సాధించిన విజయం అనతికాలంలోనే ఆమె కెరీర్‌ పంథాను మార్చడానికి దారితీసింది. సి.ఐ.డి.(1956) చిత్రంతో ప్రారంభించి, గురు దత్‌ చిత్రాలకు సైతం దుస్తులను డిజైన్‌ చేయడం ద్వారా ఆమె కెరీర్‌ పరుగు అందుకుంది.  ప్యాసా (1957), చౌధువిన్‌ కా చంద్‌ (1960), సాహిబ్‌ బీబీ ఔర్‌ గులాం (1962), ‘గైడ్‌’, ‘గంగా జమున’, ‘అమ్రపాలి’, ‘వక్త్‌’, ‘తీస్రీ మన్జిల్‌’, ‘మేరా నామ్‌ జోకర్‌’, ‘చాందిని’, ‘లెకిన్‌’, ‘లగాన్‌’ సహా వందకు పైగా చిత్రాలకు అథియా దుస్తుల రూపకర్త గా పని చేశారు.

తన 50 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆస్కార్‌ తర్వాత 1991, 2002 లలో రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను సైతం ఆమె గెలుచుకున్నారు. 2012లో అథియ మెదడులో వైద్యులు ఒక కణతి గమనించారు. ఆ కణతి ఆమెను చాలాకాలం మంచానికే పరిమితం చేసింది. 91 ఏళ్ల వయసులో 2020 అక్టోబర్‌ 15 న ఆమె కన్నుమూశారు.

మరిన్ని వార్తలు