Mutnuri Krishna Rao History: కృష్ణారావు.. కృష్ణాపత్రిక.. కృష్ణాజిల్లా

25 Jun, 2022 14:57 IST|Sakshi

కృష్ణారావు గారు రాతలో విశ్వరూపం చూపేవారు. మాటలో మాత్రం విదూషకుడి విన్యాసాలు చూపేవారు. కానీ ఆ హాస్యం వెనుక చెప్పలేనంత విషాదం ఉంది. కృష్ణారావుగారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు. అందుకే అడపా దడపా తాను మాతృ హంతకుడినని అనుకుంటూ దీర్ఘ విచారంలో మునిగిపోయేవారు. ఆరో ఏట తండ్రి ఈ లోకాన్ని వీడారు. పినతండ్రి ఇంట పెరిగారాయన. పుట్టింది దివిసీమ ప్రాంతంలోని ముట్నూరు. కృష్ణారావు గారిపై బ్రహ్మసమాజం ప్రభావం ఉండేది. మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురువుగా ఉండేవారు. కృష్ణారావు గారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. వారిలో ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు, అల్లుడు కూడా ఆయన కళ్ల ముందే తనువు చాలించారు.
చదవండి: స్వతంత్ర భారతి... భారత్‌–పాక్‌ యుద్ధం

అయినా ఆయన స్వాతంత్యోద్య్రమానికి, పత్రికా రచనకు దూరం కాలేదు. చిత్రం, ఆ హాస్య ధోరణి కూడా తుదికంటా వెన్నంటే ఉంది. కృష్ణారావుగారి చివరి దశలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే భార్య వచ్చారు. అంత్యకాలాన్ని ఆయన ఎంతో మామూలు విషయంగా తీసుకున్నారు. పాపం, ఆ ఇల్లాలు దుఃఖం ఆపుకోలేక గొల్లుమన్నారు. కృష్ణాపత్రిక స్వాతంత్య్ర ఉద్యమకాలంలో, వలస పాలన తెచ్చిన చీకటియుగంలో ఒక కంచు కాగడా అయింది. కానీ చాలామంది భావిస్తున్నట్టు కృష్ణాపత్రిక కృష్ణారావు గారి పేరు మీద నెలకొల్పినది కాదు.

అది ఆవిర్భవించే నాటికి కృష్ణారావు గారు ఆ పత్రికలో లేరు. ఇంకా చెప్పాలంటే కృష్ణానది పేరు మీద ఆ పత్రిక ఆవిర్భవించిందని చెప్పాలి. పత్రిక నెలకొల్పే సమయంలో ఉంటే తాను ‘కృష్ణవేణి’ అని నామకరణం చేయించి ఉండేవాడినని కృష్ణారావు అనేవారట. భారతదేశం పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయడం నేరుస్తున్న సమయంలో, స్వాతంత్యోద్య్రమం రూపు కడుతున్న తరుణంలో 20వ శతాబ్దానికి కాస్త ముందు, అంటే 1892లో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా  సంఘం ఏర్పడింది.

అయితే అది ఇప్పటి కృష్ణా జిల్లా కాదు. మొత్తం గుంటూరు ప్రాంతం కూడా కలసి ఉండేది. ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధికీ, రాజకీయ చైతన్యానికీ పాటు పడడమే ఆ సంస్థ ఉద్దేశం. ఇందులో సభ్యులు కొండా వెంకటప్పయ్య తదితరులకు వచ్చిన ఆలోచనే కృష్ణాపత్రిక స్థాపన. వెంకటప్పయ్యగారు న్యాయవాది. మరొక న్యాయవాదీ, కవీ దాసు నారాయణరావుతో కలసి ఇలాంటి నిర్ణయానికి వచ్చారాయన.

ఈ ప్రాంతంలో ఒక్క తెలుగు పత్రిక కూడా లేకపోవడం వారిని ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పైగా రాజకీయ చైతన్యం రేకెత్తించే ధ్యేయంతో పత్రికలు ప్రారంభమవుతున్న కాలం కూడా అదే. వెంకటప్పయ్య, దాసు నారాయణరావు మొత్తానికి అనేక ఇక్కట్ల మధ్య కృష్ణాపత్రికను పక్షపత్రికగా ఫిబ్రవరి 1, 1902న ఆరంభించారు (తరువాత వారపత్రిక అయింది). అంతలోనే దాసు హఠాన్మరణం పాలయ్యారు. ఈ పత్రిక ఆనాడే తీవ్రవాద లక్షణాలు కలిగిన పత్రికగా ముద్ర పడిందని వెంకటప్పయ్య తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఒక ఏడాది తరువాత కృష్ణారావు గారు సహాయ సంపాదకులుగా చేరారు.
(ముట్నూరి కృష్ణారావునేడు వర్ధంతి) 
– డా. గోపరాజు

మరిన్ని వార్తలు