వర్ణచిత్రాల బ్రహ్మ: రాజా రవివర్మ (1848–1906)

7 Jul, 2022 12:51 IST|Sakshi

చైతన్య భారతి

చిత్రకళ పట్ల ఓ ఆకర్షణను సృష్టించడమే కాక.. వర్గం, భాష, ప్రాంత భేదాలు లేకుండా సామాన్యుడికి సైతం చేరేలా చేసిన ఘనత రవివర్మదే! చిత్రకళను విలాసవంతం చేసిన తొలి కళాకారుడు కూడా ఆయనే. ఆయన గీసిన వర్ణచిత్రాలను అటు బ్రిటిష్‌వారు, ఇటు రాజాస్థానాలవారు ఆత్రంగా అందుకొనేవారు. ఆయనను ఒకరు తిరువాన్కూర్‌ మహారాజాకు పరిచయం చేశారు. ఆస్థాన చిత్రకారుడి ద్వారా రవివర్మకు చిత్రకళలో మెళకువలు నేర్పాలని మహారాజు భావించారు. అయితే ఆ ఆస్థాన విద్వాంసుడు కానీ, ఆస్థానంలోని డచ్‌ కళాకారుడు థియోడర్‌ జెన్‌సెన్‌కానీ రవివర్మకు నేర్పడానికి ఇష్టపడలేదు.

తైలవర్ణాలతో వారు బొమ్మలు గీయడాన్ని జాగ్రత్తగా గమనించడం ద్వారానే రవివర్మ చిత్రకళ నేర్చుకున్నారు. మద్రాసు గవర్నర్‌ చిత్రపటాన్ని గీసినప్పుడు రవవర్మ ప్రతిభ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆయన చిత్రించిన ‘నాయర్‌ ఉమన్‌ విత్‌ జాస్మిన్‌ ఫ్లవర్స్‌ ఇన్‌ హర్‌ హెయిర్‌’ వర్ణచిత్రం మద్రాసు చిత్రకళా ప్రదర్శనలో ఆయనకు స్వర్ణపతకం సంపాదించి పెట్టింది. అలాగే 1887లో వియన్నా చిత్రకళా పోటీలోనూ పతకం వరించింది. తైల మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా ఆయన తన మోడల్‌ స్త్రీలను అందంగా చిత్రించగలిగారు. ఆయన గీసిన ‘మలబార్‌ బ్యూటీ’ చిత్రం భారతదేశ ప్రతీకగా నిలిచింది.

చదవండి: (స్వతంత్ర భారతి: ప్రపంచ కప్‌ విజయం (1983/2022))

అయితే, రవివర్మకు విస్తృతంగా పేరు తెచ్చిపెట్టినవి ఆయన గీసిన చారిత్రక వర్ణ చిత్రాలు. రామాయణం, మహాభారతం, తదితర పురాణ గాథలకు ఆయన వేసిన  చిత్రాలు తమదైన ముద్ర సంపాదించుకున్నాయి. రవివర్మ చిత్రాలకు లభించిన ప్రాచుర్యం వల్ల బరోడా, మైసూర్, త్రివేండ్రం లాంటి రాజాస్థానాలు ఆయనతో భారీస్థాయిలో పౌరాణిక వర్ణ చిత్రాలను గీయించాయి.

ఆయన ఒక పక్క పాశ్చాత్య విద్యా సంప్రదాయాన్ని వినియోగిస్తూనే, మరోపక్క తంజావూరు వర్ణచిత్రాల ప్రభావాన్ని మిళితం చేసి తనదైన శైలిని ఆ చిత్రాల్లో చూపారు. రవి వర్మ 1892లో బొంబాయిలో ఒక లిథోగ్రాఫిక్‌ ప్రెస్‌ స్థాపించారు. ప్లేగు వ్యాధి ప్రబలడంతో ఆయన బొంబాయి నుంచి 1899 లో కర్లాకు ప్రెస్‌ను మార్చారు. చివరకు జర్మనీ దేశస్థుల్లో ఒకరికి దానిని అమ్మేశారు. అప్పటికే ప్రతి ఇంటా రవివర్మ చిత్రాలు చేరాయి. 
– యశోధరా దాల్మియా, కళాఖండాల సంరక్షకులు

మరిన్ని వార్తలు