Jhansi Lakshmi Bai History: తలవాల్చిన.. తలవాల్సిన రోజు

18 Jun, 2022 13:59 IST|Sakshi

పైన బ్రిటిష్‌ డేగల కళ్లు. కింద కోడిపిల్ల.. ఝాన్సీ సంస్థానం. ఏ క్షణమైనా తన్నుకుపోవచ్చు. తక్షణం ఝాన్సీకి వారసుడు కావాలి. ఆ వారసుడి చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి. తన్నుకుపోవ డానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాల్ని సర్రున తెగ్గొట్టేయాలి. అప్పుడే ఝాన్సీకి బతుకు. అప్పుడే ఝాన్సీ ప్రజలకు మెతుకు. వారసుడు లేడు. మణికర్ణిక వచ్చింది. మ..ణి..క..ర్ణి..క! ఆమెలా ఎవరూ ఉండరు. ఆమెలా ఎవరూ అశ్వాన్ని పరుగులు తీయించలేరు. ఆమెలా ఎవ్వరూ ఖడ్గాన్ని తిప్పలేరు. ఆమేనా వారసురాలు? ఝాన్సీని రక్షించేందుకు లేచి నిబడింది కదా. లేచి నడుము బిగించింది కదా. ఒరలోకి కత్తిని దోపుకుంది కదా. జవనాశ్వాన్ని ఎక్కింది కదా. ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్లవైపు చూపింది కదా. అయితే వారసురాలే. ఝాన్సీ పౌరురాలు కాదు. అయినా వారసురాలే. ఝాన్సీకి ఆమె కోడలు. ఝాన్సీ సంస్థానం ఇక కోడి పిల్ల కాదు. కోడలు పిల్ల. 

మణికర్ణిక పేరు మారింది. లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీకి రాణి. ‘లక్ష్మీబాయి అనే నేను..  చివరి రక్తపు బొట్టు చిందేవరకు, ఝాన్సీకి అత్యంత విధేయురాలినై, ఝాన్సీ ప్రజల సేవకు ఝాన్సీ సంస్థాన రక్షణకు, సంరక్షణకు.. లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం. డేగలు కళ్లెర్ర చేశాయి. ఝాన్సీ నుంచి వెళ్లిపొమ్మని వర్తమానం పంపాయి. వెళ్లిపోవడం దేశద్రోహం. మిన్నకుండిపోవడం శత్రు శేషం. శత్రువును మిగిల్చదలచుకో లేదు లక్ష్మీబాయి. బ్రిటిష్‌ ఫిరంగులు ఝాన్సీలో చొరబడ్డాయి. ఝాన్సీని మరుభూమిగా మార్చివేశాయి. లక్ష్మీబాయి, ఆమె అశ్వం, ఆమె చేతిలోని ఖడ్గం.. పోరాటం ఆపలేదు. ‘‘దేశంపై ప్రేమ.. ఓటమిని అంగీకరించనివ్వదు. దేశాన్ని శత్రువుకు వదిలి పారిపోనివ్వదు’’...

భర్త మాటలు గుర్తుకొచ్చాయి లక్ష్మీబాయికి. ‘‘నిన్ను ప్రేమించడాని కన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మీ’.. భర్త చివరి మాటలు గుర్తుకున్నాయి లక్ష్మీబాయ్‌కి. ‘నేనున్నా, పోయినా, నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ’’.

పదిహేడవ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కల కూడా అదే. స్వరాజ్యం. ఆయన కలను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీబాయి. హరహర మహాదేవ్‌. హరహర మహాదేవ్‌. శత్రుమూకల శిరస్సులు తెగి, లక్ష్మీబాయి ముఖం మీద రక్తం చింది పడుతోంది. నుదిటిపై సిందూరంలా రక్తం. కంఠంపై ఆభరణంలా రక్తం. పెదవులపై విజయహాసంలా రక్తం.

లక్ష్మీబాయి గెలిచింది. కాదు.. ఝాన్సీ గెలిచింది. కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి గెలిచింది.  ‘‘నీకు ఝాన్సీ కావాలి. నాకూ ఝాన్సీ కావాలి. ఒకటే తేడా. నీకు పాలన కావాలి. నాకు ప్రజలు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. ‘‘నీకు నా శిరస్సు కావాలి, నాకూ నీ శిరస్సు కావాలి. ఒకటే తేడా. ఝాన్సీ కోట గుమ్మం ముందు వేలాడగట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి. ఎవరికీ తలొంచే పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. 1858 జూన్‌లో గ్వాలియర్‌లో జరిగిన ఆ యుద్ధంలో 29 ఏళ్ల వయసులో ఝాన్సీలక్ష్మీబాయి శత్రువుతో పోరాడుతూనే వీర మరణం పొందారు. నేడు (జూన్‌ 18) ఆమె మరణించిన రోజు.  

మరిన్ని వార్తలు