చైతన్య భారతి: ఇరోమ్‌ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!

9 Aug, 2022 13:48 IST|Sakshi

దాదాపు 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్‌ ఉక్కు మహిళ’ ఇరోమ్‌ చాను షర్మిల. దీక్షలో ఉన్న అన్నేళ్లలోనూ ఆమె నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులోనే ఆ పదహారేళ్లూ ఆమె ఉన్నారు.  

నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం.. ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన అది:  మణిపూర్‌ ప్రభుత్వమే ఆమెను బతికిస్తూ వచ్చింది. అయితే నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్‌ ఇన్‌ట్యూబేషన్‌ పద్ధతిలో.. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు నిర్బంధంగా పంపించడం! ‘అఫ్‌స్పా’ సాయుధ బలగాలు తన కంటి ఎదురుగా జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఆ నిరాహార దీక్ష ఆరంభించారు.

అది 2000 నవంబర్‌ 2. షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్‌ దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే.. అస్సాం రైఫిల్స్‌ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రదర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు.

ఇది జరిగిన రెండు రోజుల తరువాత 2000 నవంబర్‌ 5న షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు.  దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. అప్పటికి వివాహం కాలేదు. దీక్ష వల్ల ప్రయోజనం లేదనీ, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో పోరాడాలనీ తలచి 2016 ఆగస్టు 9 న దీక్షను విరమించారు. ఆ తర్వాత ఎన్నికల్లో నిలుచున్నప్పటికీ ఆమె గెలవలేదు. అఫ్‌స్పా చట్టం నేటికీ పూర్తిగా రద్దవలేదు. షర్మిల 1972 మార్చి 2 ఇంఫాల్‌లోని కోంగ్‌పాల్‌ గ్రామంలో జన్మించారు. పౌరహక్కుల కార్యకర్త అయిన ఇరోమ్‌ తన ఉద్యమ భాగస్వామి అయిన బ్రిటిష్‌ పౌరుడు డెస్మండ్‌ ఆంథోనీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం సామాజిక అంశాలపై వ్యాస రచనలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు