Key Events Of India After Independence: అంతరిక్షం- లక్ష్యం 2047

6 Jun, 2022 13:31 IST|Sakshi
ఫొటో: సైకిల్‌పై ప్రయోగానికి ఇస్రో తొలి రాకెట్‌ విడిభాగాలు

స్వాతంత్య్రానంతరం మొదట 1963లో సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలతో మొదలుపెట్టి క్రమంగా భూకక్ష్యలోకి ఉపగ్రహాలను, గ్రహాల్లోకి పరిశోధక నౌకలను పంపే స్థాయికి భారతదేశం చేరుకుంది. రానున్న ఏళ్లలో కక్ష్యలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని సైతం నెలకొల్పబోతోంది. సుదూర గ్రహాలకు అంతరిక్ష యాత్రలు జరిపే స్థితికి ఎదగడమే కాదు, సైనిక ప్రయోజనాలకూ రోదసీని వేదికగా చేసుకోవడానికి అగ్రదేశాలతో పోటీ పడుతోంది.

అంతరిక్ష ప్రయోగాలతో ముందుకెళుతున్న ఇస్రోకు దేశవ్యాప్తంగా పలు శాస్త్రసాంకేతిక సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇస్రో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975లో ఒక సోవియట్‌ రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రయోగించారు. 2008, 2009 సంవత్సరాల్లో ప్రయోగించిన చంద్రయాన్‌ 1, 2 ప్రాజెక్టులు భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఇక 2017 ఫిబ్రవరిలో ఒకే విడతలో 104 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసిలోకి ప్రయోగించి ఇస్రో రికార్డు సృష్టించింది.

1960ల నుంచి అంతరిక్షంలో సైనిక, పౌర అవసరాలు రెండింటినీ ఇస్రోయే తీరుస్తూ వస్తోంది. 1964లో ఒక అమెరికన్‌ ఉపగ్రహం టోక్యో ఒలింపిక్స్‌ను ప్రసారం చేయడం చూసి, అంతరిక్ష కమ్యూనికేషన్‌  ఉపగ్రహాలతో ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ గ్రహించారు. ఆయనే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆద్యుడు. జాతీయ అవసరాలకు అంతరిక్షాన్ని ఉపయోగించుకోవడానికి 1969లో సారాభాయ్‌ నాయకత్వంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోని ఆరు అతిపెద్ద అంతరిక్ష సంస్థల్లో ఇస్రో ఒకటి.   

మరిన్ని వార్తలు