గోఖలేనే లేకుంటే.. గాంధీనే రాకుంటే

2 Jun, 2022 10:11 IST|Sakshi
గోపాలకృష్ణ గోఖలేతో గాంధీజీ (కూర్చున్న వారిలో ఎడమ నుంచి 4, 5)

జైహింద్‌ స్పెషల్‌ స్టోరీ

‘‘ఏప్రిల్‌లో నేను భారతదేశానికి బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. నేనిక మీ చేతులలోనే ఉంటాను...’’ ఫిబ్రవరి 27,1914 న దక్షిణాఫ్రికా నుంచి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలేకు గాంధీజీ రాసిన లేఖలోని తొలి వాక్యాలివి. దక్షిణాఫ్రికాను శాశ్వతంగా వీడి భారతదేశం రావలసిందని గోఖలే పలుమార్లు కోరిన తరువాత గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 1896లో గాంధీజీ భారతదేశం వచ్చినప్పుడు పూనాలో మొదటిసారి గోఖలేను చూశారు. తరువాత 1901 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశాల కోసం ఇద్దరూ దాదాపు నెలరోజులు కలసి ఉన్నారు. అప్పుడే గోఖలే తన మనసులోని మాటను గాంధీకి చెప్పారు.

దక్షిణాఫ్రికా భారతీయుల హక్కుల ఉద్యమానికి చేస్తున్న సేవలకు గాను 1911 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశాలు గాంధీని అభినందించాయి కూడా. గోఖలే జాంజిబార్‌ (టాంజానియా) పర్యటనలో ఉన్నప్పుడు గాంధీ వెళ్లి కలుసుకున్నారు. అప్పుడే భారత్‌కు వచ్చేయమని గోఖలే కచ్చితంగా చెప్పారు. ఆఖరికి 21 ఏళ్ల మజిలీ తరువాత జూలై 18, 1914 న గాంధీ కేప్‌టౌ¯Œ నుంచి భారత్‌కు బయలుదేరారు. ఇంగ్లిష్‌ చానల్‌ దాటగానే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కొద్దికాలం ఇంగ్లండ్‌లో చిక్కుకుపోయారు. అప్పుడే వైద్యం కోసం ఫ్రా¯Œ ్సలోని విచీ ప్రాంతానికి గోఖలే వెళ్లారు. అక్కడ మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు. చివరికి డిసెంబర్‌ 19, 1914న గాంధీ, కస్తుర్బా ఇంగ్లండ్‌లో ఎస్‌ఎస్‌ అరేబియా ఓడ ఎక్కారు. జనవరి 9, 1915 న ఉదయం 7.30 లకి ఆ ఓడ బొంబాయి తీరంలోని అపోలో బందర్‌ చేరుకుంది. గుజరాతీ కట్టూబొట్టూతో దిగిన గాంధీకి ఘనస్వాగతం లభించింది.

అదీ నెటాల్‌.. ఇది నేషనల్‌
గాంధీజీ ఇండియా వచ్చి స్థిరపడే నాటికే దక్షిణాఫ్రికాలో శాంతియుత సత్యాగ్రహోద్యమంతో ప్రిటోరియా ప్రభుత్వాన్ని లొంగదీసిన ఉద్యమకారునిగా భారతీయులకు చిరపరిచితులు. నాయకుల దృష్టిలో ఒక విశిష్ట ఉద్యమకారుడు. కానీ భారత స్వాతంత్య్ర సమరం రూపురేఖలు, పంథా ఎలా ఉన్నాయో చూడండి. జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు ముందు నాటి రాజకీయ అనైక్యత జాడలు కనిపిస్తున్నాయి. జాతీయోద్యమం మితవాద, అతివాద వర్గాల మధ్య నలుగుతున్నది. తీవ్ర జాతీయవాదంతో, వ్యక్తిగత హింసాపథంతో భీతిల్లుతున్న బ్రిటిష్‌ ప్రభుత్వం దేశవాసులందరి మీద అణచివేతను తీవ్రతరం చేసింది.

అయినా జాతీయోద్యమం శాంతి పథాన్ని వీడరాదన్నదే నాయకుల అభిమతం. జాత్యహంకారం, అణచివేతలకు పేర్గాంచిన దక్షిణాఫ్రికా శ్వేతజాతి పాలన మీద ‘నెటాల్‌ ఇండియ¯Œ కాంగ్రెస్‌’ సంస్థతో గాంధీ సాధించిన విజయాలు శాంతియుత పంథాలోనే సాధ్యమైనాయి. హింస, ప్రతిహింస లేవు. అదే గోఖలేని ప్రభావితం చేసి, గాంధీజీని భారత దేశం రప్పించింది. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని ఐక్యంగా సాగించగల నాయకుడిని గోఖలే గాంధీలో చూశారని అనిపిస్తుంది. పెరుగుతున్న ముస్లిం లీగ్‌ ప్రాబల్యం జాతీయోద్యమానికి ఉపకరించేటట్టు మలచడం నాటి అవసరం. 1893లో ఎస్‌ఎస్‌ సఫారీ ఓడ మీద దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ కుల,మత, ప్రాంత విభేదాల ప్రసక్తి లేకుండా అక్కడ మొత్తం భారతీయులందరికి ఆమోదయోగ్యుడయ్యారు. 50,000 మంది భారతీయుల హక్కుల కోసం సాగిన ఆ పోరాటంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ఉన్నారు. క్రైస్తవుల వివాహ హక్కు గురించి కూడా గాంధీ ఉద్యమించారు. లక్ష్య సాధనలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడం అనే విద్య గాంధీలో ఉంది. దక్షిణ భారతదేశం వారు, ఉత్తర భారతం వారు కూడా ఆయన వెంట నడిచారు. 

గాంధీకి ముందే.. మహామహులు!
దక్షిణాఫ్రికా నుంచి గాంధీ ఇండియాకు వచ్చేవరకు ఇక్కడ జాతిని కదిలించే స్థాయిలో ఉద్యమం ఆరంభం కాలేదని అనుకోడాని లేదు. ఒక శక్తిమంతమైన స్వాతంత్య్ర పోరాట జాడలు సుస్పష్టంగా ఉన్నాయి. దాదాభాయ్‌ నౌరోజీ, రెనడే, గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, లాల్, పాల్, బాల్, ఫిరోజ్‌షా మెహతా, మదన్‌ మోహన్‌మాలవీయ, సరోజినీనాయుడు, మోతీలాల్‌ వంటివారు నిర్వహించిన ఉద్యమమది. అయినా అది వేరు, గాంధీ రాక తరువాతి పోరాట స్వరూపం వేరు. గాంధీ ఉద్యమ రూపం వేరైనా, అంతకు ముందు జరిగిన ఉద్యమాన్ని తక్కువ చేయడం చారిత్రక దృష్టి కాబోదు. మైదాన ప్రాంత స్వరాజ్య సమరంతో పాటు, రైతాంగ ఉద్యమాలు, కొండలలో గిరిజనోద్యమాలు జరిగాయి. విదేశాలు కేంద్రంగా తీవ్ర జాతీయవాదంతో భారత్‌ స్వేచ్ఛ కోసం గదర్‌ పార్టీ ఉద్యమించిన కాలం కూడా అదే. వీటితో భారతీయులు సాధించిన కొన్ని విజయాలూ ఉన్నాయి.
 – డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు