చరిత్రాత్మక సినీ రూపకర్త: బిమల్‌ రాయ్‌

15 Jul, 2022 14:17 IST|Sakshi

చైతన్య భారతి: 1909–1966

బిమల్‌ రాయ్‌ ప్రముఖ బెంగాలీ, హిందీ సినిమా దర్శకులు. దో బిఘా జమీన్, పరిణీత, బిరాజ్‌ బహు, దేవ్‌దాస్, మధుమతి, సుజాత, పరఖ్, బందిని వంటి వాస్తవిక, సామాజికాంశాలతో కూడిన చిత్రాలను ఆయన తీశారు. రాయ్‌ ఢాకా లోని సువాపూర్‌లో జన్మించారు. అక్కడి నుంచి వారి కుటుంబం కలకత్తా వచ్చాక సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు.

ఆ క్రమంలో గొప్ప సినిమా దర్శకునిగా అవతరించారు. అనేక అవార్డులను పొందారు. అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఆయన్ని వరించాయి. దురదృష్టం ఏమిటంటే.. 56 ఏళ్లకే ఆయన క్యాన్సర్‌తో మరణించారు. ఆయన సతీమణి మనోబినా రాయ్‌. వారికి ముగ్గురు కూతుళ్లు.. రింకీ భట్టాచార్య, యశోధరా రాయ్, అపరంజితా సిన్హా; ఒక కుమారుడు జాయ్‌ రాయ్‌. 

తండ్రి గురించి జాయ్‌ రాయ్‌ మాటల్లో మరికొంత తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది : ‘‘గదులన్నీ పుస్తకాలు, చలన చిత్రాలతో నిండిపోయి ఉండటం నాకు చిన్నప్పట్నుంచీ గుర్తే! నా తోబుట్టువులు, నేను ఆ పుస్తకాలను, ప్రపంచంలోని బొమ్మలను ఆశ్చర్యంగా చూసేవాళ్లం. తరచు మా నాన్నగారు అతిథులను ఆహ్వానించేవారు.చిత్ర రూపకల్పనను ఎంతో ప్రేమించే మా నాన్నగారు  మమ్మల్ని మాత్రం అందులోకి దిగడానికి ప్రోత్సహించేవారు కాదు. సినిమా వాతావరణం కన్నా మా ఇంట్లో ఓ ప్రత్యేకమైన సంస్కృతి విలసిల్లుతూ ఉండేది.

జమీందారు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన కుటుంబం మోసానికి గురవడంతో ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు. సినిమాల రూపకల్పన ఒక్కటే ఆయనకు మిగిలిన ఏకైక వ్యామోహం. 1960లలో ఆయనకు చరిత్రాత్మక సినీ రూపకర్తగా పేరు వచ్చింది. నిజానికి 1932 నుంచే ఆ రంగంలో ఆయన పని చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఆయన సినీ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆ తరువాత ఆయన తన  భావోద్వేగాలను సెల్యులాయిడ్‌ పైకి తర్జుమా చేయడం ప్రారంభించారు. దో బిఘా జమీన్‌ చిత్రం ఆయన వ్యక్తిగత అనుభవానికి ప్రతిరూపమని నా భావన.

ఆయన రూపొందించిన చిత్రాలన్నీ ఆయన ఆలోచనల్ని, అనుభవాలనే ప్రతిబింబించేందుకు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు. ఆయన తన వనరులన్నిటినీ చిత్ర నిర్మాణానికే ఖర్చుపెట్టేవారు. ఏదైనా సరే నిర్దుష్టంగా ఉండాలనే తపన వల్ల ఆయన శక్తి, సమయం ఖర్చయ్యాయి. ప్రతి చిన్న దాని మీదా ఆయన చూపిన ఆ శ్రద్ధాసక్తుల వల్లే ఇవాళ్టికీ ఆయన చిత్రాలు నిలబడుతున్నాయి’’ అంటారు జాయ్‌ రాయ్‌.

మరిన్ని వార్తలు