చైతన్య భారతి: స్త్రీవాద వర్ణాలు-అమృతా షేర్‌గిల్‌

14 Jul, 2022 13:53 IST|Sakshi

1913–1941

అమృత తన వర్ణచిత్రాల ద్వారా , తన వ్యక్తిత్వం ద్వారా ఈ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఆమె చిత్రాలలో కనిపించే ఎడతెగని మార్పులకు అమృత పుట్టుపూర్వోత్తరాలే ప్రధాన కారణం. అయితే, ఈ విషయంలో కాలాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. భారతదేశమే పరిణామక్రమంలో ఉన్న సమయంలో ఆమె జీవించారు. ఆమె మాతృమూర్తి హంగేరియన్‌.

తండ్రి పదహారణాల భారతీయుడు. దాంతో తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే స్పృహ అమృతలో గాఢంగా ఉండేది. ఆమెకు తన శారీరక సౌందర్యానికి సంబంధించిన స్పృహ కూడా ఎక్కువే. ఆమె తన అందచందాలను అనేక రకాలుగా ప్రదర్శించారు. అందులో చాలాభాగం ఫొటోలను ఆమె తండ్రి ఉమ్రావ్‌ సింగ్‌ స్వయంగా తీశారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కలిగి, భారతదేశానికి వచ్చి సంచలనం సృష్టించిన ‘విమోచన పొందిన మహిళ’గా ఆమె చాలామందికి గుర్తుండిపోయారు. చనిపోవడానికి సుమారు రెండేళ్ల ముందు ఆమె హంగేరీలో ఉండగా వేసిన ‘టు ఉమెన్‌’ అరుదైన చిత్రం.

అందులోంచి స్త్రీవాదం తొంగి చూస్తుంటుంది. స్త్రీత్వానికి తాను చెప్పిన భాష్యాన్ని తానే ఎదుర్కొన్న చిత్రం అది. ఆధునిక భారతీయ మహిళ అనే పదం అరిగిపోయినదిగా కనిపించవచ్చు. కానీ అంతిమంగా, నాకు అమృత.. ఆ పదానికి తగిన నిర్వచనంలా కనిపిస్తారు. ఆమె వర్ణచిత్రాలే అందుకు తార్కాణాలు.  28 ఏళ్ల వయసుకే అనారోగ్యంతో మరణించిన అమృత తను జీవించిన కొద్ది కాలంలోనే అమూల్యమైన చిత్రకారిణిగా పేర్గాంచారు. అప్పట్లో భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌లను చిత్రించిన మహిళ అమృతాయే.

1938లో గోరఖ్‌పూర్‌లోని తన ఎస్టేట్‌లో ఆమె గీసిన ‘ఇన్‌ ది లేడీస్‌ ఎన్‌క్లోజర్‌’ చిత్రం.. ఇటీవలే 2021 వేలంలో 37.8 కోట్లకు అమ్ముడయింది. చిత్రకారిణిగా ఆమె తన ఆర్ట్‌ వర్క్‌ను ప్రేమించినట్లే భారతదేశాన్నీ ప్రేమించారు. 1938లో అమృత తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టర్‌ ఈగాన్‌ను వివాహమాడారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో స్థిరపడ్డారు. 1941లో లాహోర్‌లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు తీవ్రమైన ఆనారోగ్యం బారిన పడ్డారు. ఆ ఏడాది డిసెంబర్‌ 6 అర్ధరాత్రి తను గీస్తున్న బొమ్మలపైనే ఒరిగిపోయారు.  
– వివాన్‌ సుందరం, అమృతా షేర్‌గిల్‌ బంధువు

మరిన్ని వార్తలు