మాస్తి వెంకటేశ అయ్యంగార్‌: జననం, మరణం ఒకేరోజు!

6 Jun, 2022 13:20 IST|Sakshi

మాస్తి వెంకటేశ అయ్యంగార్‌ ప్రముఖ కన్నడ రచయిత. ఆయన తన రచనలకు గాను భారతీయ సాహిత్య రంగంలో అత్యుత్తమ పురస్కారమైన ‘జ్ఞానపీఠ్‌’ను అందుకున్నారు. కన్నడ భాషలో చిన్నకథల రచనలో మాస్తి ప్రసిద్ధులు. ఆయన చిన్నకథల పుస్తకానికి ‘కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం‘ లభించింది. శ్రీనివాస కలం పేరుతో ఆయన రచనలు చేశారు. కన్నడ సాహిత్యరంగంలో మాస్తి కన్నడద ఆస్తి (మాస్తి కన్నడకు ఆస్తి) అన్న సూక్తి బహుళ ప్రచారం పొందింది. మాస్తి వెంకటేశ అయ్యంగార్‌ 1891 జూన్‌ 6న నేటి కర్ణాటక రాష్ట్రంలో కోలార్‌ జిల్లాలోని కోసహళ్లిలో జన్మించారు.
చదవండి: ఆకుపచ్చని అమృతం

కళాశాల విద్యను అభ్యసించిన మాస్తి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఎ. చేశారు. మైసూరు మహారాజా ప్రభుత్వంలో మైసూరు సివిల్‌ సర్వీసెస్‌ లో చేరి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా జిల్లా కమీషనర్‌ బాధ్యతల్లో పనిచేశారు. దివాన్‌ పదవికి తను అన్ని విధాలా అర్హుడైనా తనకన్నా తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న సహోద్యోగికి ఆ పదవిని ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశారు. కన్నడ సాహిత్యంలో చిన్నకథల ప్రక్రియ వికాసంలో మాస్తి వెంకటేశ అయ్యం గార్‌ ది ప్రధాన పాత్ర. మొదట ఇంగ్లిష్‌ భాషలో రచనలు చేసిన మాస్తి, అనంతరం కన్నడ భాషలో రాయడం ప్రారంభించారు.  17 ఆంగ్ల పుస్తకాలు, 123 కన్నడ గ్రంథాలు రచించారు. ఆయన తొలినాళ్ల రచనల్లో బ్రిటిష్‌ పాలకుల దౌర్జన్యాలపై నిరసన ‘కలం’ కనిపిస్తుంది. మాస్తి 1986 జూన్‌ 6న బెంగళూరులో మరణించారు.

మరిన్ని వార్తలు