శతమానం భారతి: కార్మిక వర్గం

23 Jun, 2022 09:47 IST|Sakshi

భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్‌ పాలనకు నిరసనగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరురోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్‌ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్‌ కమ్యూన్‌  లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్‌ సెషన్‌లోకి దూసుకెళ్లడం పూర్ణ స్వరాజ్‌ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్‌  సభ, వర్కర్స్‌ పీసెంట్స్‌ పార్టీ కార్యాచరణలు.. యునైటెడ్‌ ప్రావెన్స్‌లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి.

1946లో రాయల్‌ ఇండియన్‌  నేవీలో తిరుగుబాటుకు ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు బ్రిటిష్‌ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది. ఈ కాలంలోనే, దేశంలో మొట్టమొదటి కార్మిక వర్గ సమాఖ్య అయిన అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌  కాంగ్రెస్‌కు బలమైన రాజకీయ మద్దతు లభించింది. లాలా లజపతి రాయ్‌ నుంచి జవహర్‌ లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్, సరోజిని నాయుడు వరకు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు.

మరోవైపున 1944లో ‘ఎ బ్రీఫ్‌ మెమొరాండమ్‌ అవుట్‌లైనింగ్‌ ఎ ప్లాన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ఇండియా’ (బాంబే ప్లాన్‌ గా సుప్రసిద్ధమైంది) ప్రచురితమైంది. పూచీ తీసుకునే ప్రభుత్వం, ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యత ఉండే ఆర్థిక వ్యవస్థను బాంబే ప్లాన్‌  ప్రబోధించింది. ఆ భావన సాకారమయ్యేలా వచ్చే ఇరవై ఐదేళ్లలో ఆచరణీయతకు భారత్‌ సంకల్పం పెట్టుకుంది.   

(చదవండి: చైతన్య భారతి: అణుశక్తిమాన్‌)

మరిన్ని వార్తలు