ధీరుడు గౌడప్ప.. ధీశాలి చెన్నమ్మ

30 Jun, 2022 10:57 IST|Sakshi

గౌడప్పను లొంగదీసుకోవడం బ్రిటిష్‌ సైన్యానికి చాలా రోజులు సాధ్యపడలేదు. వారం పైన యుద్ధం చేసినా అయన కోటను పగలగొట్టలేకపోయారు. చెన్నమ్మ అయితే అపారమైన బ్రిటిష్‌ సైన్యాన్ని చూసి కూడా అదరక, బెదరక ఒరలోంచి కత్తిని లాగి ముందుకు దుమికింది.

కట్టబ్రహ్మన ఉరితో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలెగాళ్ల వ్యవస్థను నిర్మూలించడం ప్రారంభించింది. 1800లో కలెక్టర్‌ మన్రో రాయలసీమలోని 140 మంది పాలెగాళ్లను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వారి ఆదాయాన్ని పూర్తిగా లాక్కోవడానికి ప్రయత్నం చేయటంతో పాలెగాళ్లు తిరుగుబాటు చేశారు. 

1801లో ప్రస్తుత చిత్తూరు (అప్పట్లో ఉత్తర ఆర్కాట్‌ జిల్లా) పరిధిలోని బంగారుపాళ్యం పాలెగాని హత్యతో మొదలైన మన్రో అణచివేత 1807 ఆదోని పాలెగాడు అనంతప్ప హత్యతో ముగిసింది. ఎక్కువమంది పాలెగాళ్లు యుద్ధం చేసి బ్రిటిష్‌ కంపెనీ సైన్యం చేతిలో చనిపోయారు. కొందరు మాత్రం మన్రోతో ఒప్పందం చేసుకుని ఆస్తులను, కోటలను వదులుకుని వారిచ్చే పెన్షన్‌ తీసుకున్నారు.

ముతుకూరి గౌడప్ప
ఇక్కడ మనం కర్నూలు జిల్లా తెర్నేకల్‌ పాలెగాడు  ముతుకూరి గౌడప్ప గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గౌడప్పను లొంగదీసుకోవడం బ్రిటిష్‌ సైన్యానికి చాలా రోజులు సాధ్యపడలేదు. వారం పైన యుద్ధం చేసినా అయన కోటను పగలగొట్ట లేకపోయారు. చివరికి గౌడప్ప సైన్యంలోని ఒకరిని లొంగదీసుకుని కోట రహస్యాలను తెలుసుకుని, గౌడప్పని బంధించి బహిరంగంగా ఉరి తీశారు. గౌడప్ప ఉరి కన్నా ముందు అనేకమంది.. కోట లోని ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిటిష్‌ అధికారుల రికార్డుల ప్రకారం (బెన్సన్‌ రిపోర్ట్, మన్రో రిపోర్ట్‌)1807 నాటికి దక్షిణాదిలో పాలెగాళ్ల వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. కాని తిరిగి నరసింహారెడ్డి రూపంలో ఉగ్రరూపం దాల్చింది! 

నరసింహరెడ్డి ఉయ్యాలవాడ, నుసుం పాలెగాడు. తల్లి వైపు వారసులు లేకపోవడంతో నుసుం కూడా నరసింహరెడ్డికి దక్కింది. ఆయన తండ్రి మన్రోతో ఒప్పందం చేసుకుని పెన్షన్‌ తీసుకున్నాడు. 1843 ప్రాంతంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ‘వారసత్వ హక్కుల’ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్ట ప్రకారం వారసత్వంగా సంక్రమించే ‘మిరాసి’ హక్కుల్ని కోల్పోవలసి రావడంతో జమీందారులు, పాలెగాళ్లు తమ వారసత్వ మాన్యాలు, ఇనాం భూములు, పెన్షన్‌లు పొందలేకపోయారు. ఈ మిరాసి రద్దు చట్టం వల్ల ఉయ్యాలవాడ నరసింహరెడ్డి నుసుం లేదా ఉయ్యాలవాడ రెండిటిలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా వదులుకోవలసి వచ్చింది. అదే సమయంలో అయన సోదరుడు జయరామిరెడ్డి మరణించడం వల్ల ఆయనకు వచ్చే పెన్షన్‌ బ్రిటిష్‌ వారు రద్దు చేశారు. వారసత్వంగా అది నరసింహరెడ్డికి రావాలి.  ఆ కారణంతో నరసింహ రెడ్డి 1846లో బ్రిటిష్‌ వారి పై తిరుగుబాటు చేశాడు. అనేక నెలల పాటు గొరిల్లా యుద్ధం చేశాడు. చివరికి బ్రిటిష్‌ వారు నరసింహరెడ్డిని బంధించి ఉరి తీసి అయన శవాన్ని అనేక రోజుల పాటు కోట గుమ్మానికి వేలాడదీశారు. అస్థిపంజరం నశించినా కూడా ఇనుప గొలుసులు సంవత్సరాల పాటు అలాగే ఉంచారంటే తిరుగుబాటు ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తిరుగుబాట్లను అణచి వేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి క్రూరమైన హత్యలను బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రోత్సహించింది. 

కిట్టూరి  చెన్నమ్మ
బ్రిటిష్‌ పాలనా కాలంలో తన రాజ్య స్వతంత్రానికై బ్రిటిష్‌ కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనిత కిట్టూరి చెన్నమ్మ (1778 అక్టోబర్‌ 23 –1829 ఫిబ్రవరి 21). కన్నడ దేశానికి చెందిన కిట్టూరు రాజ్యానికి ఆమె రాణి. కిట్టూరు అనేది బెల్గాం రాజ్యానికి సమీపంలో ఉన్న చిన్న రాజ్యం.  ఈస్ట్‌ ఇండియా కంపెనీ వలస సామ్రాజ్య విధానానికి వ్యతిరేకంగా తన గళమెత్తి, వారి అక్రమాలపై తిరగబడి, వారి అఘాయిత్యాలను నిరసిస్తూ 1824లో వారి అపార సైన్యానికి బెదరక, మొక్కవోని దైర్యంతో తిరుగుబాటు చేసింది. చివరికి వారికి బందీగా చిక్కి చెరసాలలో మరణించింది. ఝాన్సీ రాణి కంటే 34 సంవత్సరాల ముందే స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన యోధురాలు కిట్టూరు చెన్నమ్మ, భారతదేశ చరిత్రలోనే ఆమె సాహసం చిరస్థాయిగా నిలిచిపోతుంది. 

హైదరాబాద్‌ తిరుగుబాట్లు
1827లో హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో జరిగిన సంఘటన మరో పోరాటానికి తెర తీసింది. అదే ‘మోమినాబాద్‌ పితూరి (ఉద్యమం)’. 1827 సైన్య సహకార ఒప్పందంపై దేశంలోనే తొలిసారిగా సంతకం చేసినవారు రెండవ నిజాం (1798–1800) ఆలీఖాన్‌. దీంతో బ్రిటిష్‌ వారు నిజాం సైన్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతకుపూర్వమే 1811లో బ్రిటిష్‌ రెసిడెంట్‌ గా రస్సెల్‌ అనే కమాండర్‌ నిజాం సైన్యాన్ని పూర్తిగా ఆధునీకరించి, 1813 నాటికి రస్సెల్స్‌ బ్రిగేడ్‌ను ఏర్పరిచాడు. దానినొక శక్తివంతమైన క్రమశిక్షణతో కూడుకున్న సైనిక బెటాలియన్‌గా మార్చేసాడు. దానిని 1820లో సర్‌ చార్లెస్‌ మెట్కాఫ్‌ మరింత పటిష్టపరిచాడు. పేరుకే నిజాం సైన్యం, కాని అధికారం పూర్తిగా కంపెనీ ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో 1827లో బ్రిటిష్‌ కమాండర్‌లు తీసుకున్న కొన్ని చర్యల ఫలితంగా మే 5 తేదీ ఇద్దరు సిపాయిలు బ్రిటిష్‌ ప్రభుత్వంపై, వారి అధికారులపై తిరుగుబాటు చేశారు. వీరిని కల్నల్‌ డేవిస్‌ కాల్చి చంపాడు. అది భయానక ఉదాహరణగా పరిణమించి బ్రిటిష్‌ అధికారులపై తిరుగుబాటు విషయంలో ఒక హెచ్చరికగా కొనసాగింది.

‘పితూరీ’ ఘటనలు
మరొక ఘటన.. ‘బొల్లారం పితూరీ’. 1855 సెప్టెంబర్‌ లో హైదరాబాద్‌ లోని బొల్లారంలో నిజాం అశ్వికదళంలోని కొంతమంది సిపాయిలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరిని కోలిన్‌ మేఖంజి అనే బ్రిటిష్‌ కమాండర్‌ అణచివేసే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ బొల్లారం తిరుగుబాటు తరువాతే ఉత్తరాన 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఇలా దక్షిణ భారతదేశంలో జరిగిన ఈ తొలి తిరుగుబాట్లు అనుకున్న లక్ష్యాలను, విజయాలను సాధించలేకపోయినా అవి విఫలం అయ్యాయని భావించలేము. ఈ తిరుగుబాట్లు సామాన్య ప్రజానీకంలో తీవ్రమైన బ్రిటిష్‌ వ్యతిరేక భావాలను నాటుకునే విధంగా చేయగలిగాయి. భావి తరాలలో విదేశీపాలనపై కొనసాగిన స్వాతంత్య్ర సమర పోరాట స్థాయిని పెంచడానికి ఈ తిరుగుబాట్లు ఎంతగానో దోహదపడ్డాయి.  
– డాక్టర్‌ మురళి పగిడిమర్రి 
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలలో చరిత్ర శాఖాధిపతి

మరిన్ని వార్తలు