శతమానం భారతి: పోషకాహారం

3 Jul, 2022 09:37 IST|Sakshi

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత స్త్రీ పురుష నిష్పత్తిలోని మహిళల జనాభా 2021 నాటికి కాస్తయినా పెరిగింది.  లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి చేరింది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలానే ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య.

 కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. భారతదేశం ఈ 75 ఏళ్లలో అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించినప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతోంది.

ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇది అవరోధం అయినా కావచ్చు.  అందుకే దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంబులెన్స్‌ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్‌ అండ్‌ ఛైల్డ్‌ హెల్త్‌ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగబోతోంది.  

(చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 నెహ్రూ వారసత్వం)

మరిన్ని వార్తలు