చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు

21 Jun, 2022 08:17 IST|Sakshi

స్వామి కువలయానంద ప్రసిద్ధ యోగా గురువు. ఆయన అసలు పేరు జగన్నాథ గణేశ గుణే. 1883 ఆగస్టు 30న జన్మించారు. ఆయన యోగా గురువు మాత్రమే కాదు. యోగా పరిశోధకులు కూడా. కువలయానంద ప్రధానంగా యోగా శాస్త్రీయ పునాదులపై తన మార్గదర్శక పరిశోధనకు పేర్గాంచారు. 1920లో యోగాపై పరిశోధన ప్రారంభించి, 1924లో యోగా అధ్యయనం కోసం ‘యోగా మీమాంస’ అనే  పుస్తకాన్ని ప్రచురించారు. స్వామి కువలయానంద  గుజరాత్‌ రాష్ట్రంలోని ధబోయ్‌ గ్రామంలో సంప్రదాయ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో  జన్మించారు. కువలయానంద తండ్రి శ్రీ గణేశ గుణే ఉపాధ్యాయులు. తల్లి సరస్వతి గృహిణి. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్వచ్ఛంద సంస్థలపై వారు కొంతకాలం ఆధారపడవలసి వచ్చింది. కువలయానంద చదువు కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది.

అయినప్పటికీ ఆయన 1903లో మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులయ్యారు. బరోడా కాలేజీలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌ పొందారు. కువలయానంద విద్యార్థి రోజుల్లో శ్రీ అరబిందో, లోకమాన్య తిలక్‌ వంటి రాజకీయ నాయకుల వల్ల ప్రభావితమయ్యారు. ఆయన జాతీయ భావవాదం, దేశభక్తి ఉద్వేగం ఆయన తన జీవితాన్ని మానవాళి సేవకు అంకితం చేయడానికి ప్రేరేపించాయి. ఈ సమయంలోనే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేందుకు ప్రతిజ్ఞను తీసుకున్నాడు. 1916 నుండి 1923 వరకు ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు భారతీయ సంస్కృతిపై పాఠాలు బోధించారు. అందులో యోగా అంతర్లీనమై ఉండేది.

యోగాలో కువలయానంద మొదటి గురువు బరోడాలోని జుమ్మదాడ వ్యాయామశాల ప్రొఫెసర్‌ రాజారత్న మాణిక్‌రావు. 1919లో కవలయానంద నర్మదా నది ఒడ్డున బరోడా సమీపంలోని మల్సార్‌లో స్థిరపడిన బెంగాలీ యోగి పరమహంస మాధవదాస్‌ను కలిశారు. మాధవదాస్‌ మార్గదర్శకత్వంలో కువలయానందకు యోగా క్రమశిక్షణ అలవడింది. కువలయానంద ఆధ్యాత్మికంగా ఆదర్శవాది అయినప్పటికీ, అదే సమయంలో కఠినమైన హేతువాది.

కాబట్టి యోగా ప్రభావాల శాస్త్రీయతలపై పరిశోధనలు జరిపారు. 1930ల నాటికే కువలయానంద భారతదేశంలో యోగావంటి శారీరక విద్యను వ్యాప్తి చేయడానికి ఒక మార్గంగా యోగా ఉపాధ్యాయుల సమూహాలకు శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర యోగాలో శిక్షణ పొందిన వారిలో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఒకరు! 1929 లో నెహ్రూ కువలయానందను కలవడం జరిగింది. ఆయనతో పరిచయం ఆయ్యాకే నెహ్రూకు యోగాపై గురి ఏర్పడింది. 1931 నుంచీ నెహ్రూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ వచ్చారు.  కువలయానంద తన 82 ఏళ్ల వయసులో 1966 ఏప్రిల్‌ 18న మరణించారు.  

(చదవండి: సామ్రాజ్య భారతి.. 1876/1947)

మరిన్ని వార్తలు