శతమానం భారతి: కొత్త పార్లమెంట్‌

10 Aug, 2022 13:36 IST|Sakshi

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 కంటే నాలుగు రోజులు ముందుగానే ముగిశాయి. ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులు ఆమోదం పొందాయి. దేశానికి కొత్త రాష్ట్రపతి వచ్చారు. కొత్త ఉపరాష్ట్రపతి వచ్చారు. ఇక మిగిలింది కొత్త పార్లమెంటు! రానున్న శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రు. 13,450 కోట్ల అంచనాతో మోదీ ప్రభుత్వం తలపెట్టిన ‘సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరిగింది. ప్రాజెక్టులోని మొత్తం నిర్మాణాలు 2026 నాటికి పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో సెంట్రల్‌ విస్టా పనులు జరుగుతున్నాయి.
చదవండి: ఉళ్లాల రాణి అబ్బక్క.. ఐదు యుద్ధాల విజేత

ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు భవనంపై దేశ జాతీయ చిహ్నమైన అశోకస్తంభం ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ప్రధాని మోదీ సూచించిన విధంగా నవ, స్వయం సమృద్ధ భారతదేశపు మౌలిక ఆలోచనా విధానాలను ప్రతిబింబించే రీతిలో ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూలై 11న మోదీ అక్కడ అశోక స్తంభాన్ని ఆవిష్కరించారు.

కాంస్యంతో తయారు చేసిన ఈ జాతీయ చిహ్నం 21 అడుగుల పొడవు, 9500 కిలోల బరువు, 3.3–4.3 మీటర్ల చుట్టు కొలతతో ఉంటుంది. నవ భారతం ఆకాంక్షలు ఇకపై ఈ కొత్త పార్లమెంటు ద్వారా నెరవేరనున్నాయి. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాల పరిరక్షణ దిశగా జాతీయ చిహ్నం ఉత్తేజం ఇస్తూ ఉంటుంది. అమృతోత్సవాల ముగింపు నాటికి కాస్త ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంటు భవనం.. భారత్‌ పురోగతికి ఒక ముందడుగు సంకేతంగా భాసిల్లుతోంది.

మరిన్ని వార్తలు