మహోజ్వల భారతి: చాణక్య నరసింహ

28 Jun, 2022 07:56 IST|Sakshi

భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పని చేసిన పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి నేడు (జూన్‌ 28).  న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత. ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాది నేత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించగలిగారు. తెలంగాణ లోని వరంగల్‌ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. పూర్వపు కరీంనగర్‌ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు. 1938 లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు.

అనంతరం ఓ మిత్రుడి సాయంతో నాగపూర్‌ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్‌.ఎల్‌.బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌ లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో అనేక వ్యాసాలు రాశారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. తన ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే.  ఏడాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 1921లో జన్మించిన పీపీ 2004లో తన 88 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్‌ 23 న కన్నుమూశారు.

(చదవండి: మహోజ్వల భారతి: ఐదు యుద్ధాల వీరుడు)

మరిన్ని వార్తలు