స్ఫూర్తి యోధులు లాల్‌ బాల్‌ పాల్‌... సమర యోధులు రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య

20 Jul, 2022 13:33 IST|Sakshi
లాలా లజపతి రాయ్‌ (పంజాబ్‌), బాల గంగాధర తిలక్‌ (మహారాష్ట్ర), బిపిన్‌ చంద్రపాల్‌(బెంగాల్‌)

1905లో బెంగాల్‌ విభజన సందర్భంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్‌ చంద్రపాల్‌ దేశవ్యాప్తంగా పర్యటించి బ్రిటిష్‌వారి చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాజకీయ స్పృహను కలిగించారు. 1911లో బెంగాల్‌ విభజనను రద్దు చేసినా ఆ విప్లవ జ్వాల దేశమంతా పాకింది. సర్కారు జిల్లాల నుంచి ఎందరో  స్వాతంత్య్ర పోరాటం దిశగా ఆలోచన ఆరంభించారు. అందులో తెనాలి ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ జాతీయోద్యమం ఊపందుకోకముందే గ్రామీణుల్లో రగులుతున్న విప్లవాగ్నిని సూచించే కొన్ని సంఘటనలు జరిగాయి. 1909లో సంచలనం కలిగించిన కఠెవరం బాంబు కేసు అందులో ఒకటి. 

విజృంభణకు ప్రేరణ
ఉత్తర భారతదేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఉద్యమం విజృంభించిన రోజులవి. కొన్ని దేశాల్లో ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకుల హత్యలు సర్వసాధారణమయ్యాయి. రష్యా, ఇటలీ చక్రవర్తుల్ని హతమార్చారు. ఆస్ట్రియా మహారాణి దారుణహత్యకు గురైంది. అలాగే స్పెయిన్‌ ప్రధాని, ఫిన్లాండ్‌ గవర్నర్‌ జనరల్‌ కూడా హంతకుల చేతుల్లో బలయ్యారు. ఉత్తరాదిన ఉగ్రవాదం విజృంభణకు ఇదే ప్రేరణ.

స్థానిక యువకులు
అప్పట్లో తెనాలికి సమీపంలోని కంచర్లపాలెం, కఠెవరం గ్రామాలకు చెందిన సాహస యువకులు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య తమ మిత్రులను కొందరిని కలుపుకుని బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఉగ్రవాదుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద నాయకులు అత్యంత రహస్యంగా కొందరు అనుచరులను ఇక్కడకు పంపి ఈ ముగ్గురికి బాంబుల తయారీలో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తయ్యాక చెన్నై– న్యూఢిల్లీ రైలు మార్గాన్ని కఠెవరం వద్ద పేల్చివేసేందుకు వీరు పథకం పన్నారు.

కొబ్బరికాయ (టెంకాయ)లో పేలుడు పదార్థాలు కూర్చి 1909 ఏప్రిల్‌ 2న బాంబుల్ని సిద్ధం చేశారు. చెన్నైకు వెళుతున్న వైస్రాయ్‌ రైలును పేల్చివేయాలని, రైలు మార్గం ధ్వంసం చేయాలని నిర్ణయించారు. దీనికి ముందుగా బాంబులు పనిచేస్తున్నాయో? లేదో? పరీక్షించాలని భావించారు. ఏప్రిల్‌ 3న కఠెవరం–కంచర్లపాలెం మధ్యగల కట్టపై ఒక కొబ్బరికాయ బాంబును వుంచి వెళ్లారు. అనూహ్యంగా అక్కడ వున్న కొబ్బరికాయ(బాంబు) ను చెన్ను అనే పశువుల కాపరి చూశాడు. దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించడంతో బాంబుపేలింది. చెన్ను ఖండఖండాలు 70గజాల దూరంలో పడ్డాయి. 

ద్వీపాంతరవాస జీవిత ఖైదు
తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును బ్రిటిష్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య, చుక్కపల్లి రామయ్యలను కుట్రదార్లుగా నిర్ధారించింది. ఏప్రిల్‌ 6న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. కోర్టులో నిందితులు బసవయ్య, బ్రహ్మయ్య తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, పి.వి.శ్రీనివాస రావు, ఎ.లక్ష్మీ  నరసింహం కేసు వాదించారు.

చుక్కపల్లి రామయ్య న్యాయవాదిని తిరస్కరించారు. న్యాయస్థానం రామయ్యకు ద్వీపాంతరవాస జీవితఖైదు విధించింది. బసవయ్య, బ్రహ్మయ్యలకు పదేళ్ల వంతున శిక్ష విధించారు. ఈ ముగ్గురినీ అండమాన్‌ జైలులో వుంచారు. వీరు అక్కడే జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యారు.
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి  

(చదవండి: సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్రీడమ్‌ యాక్షన్‌)

మరిన్ని వార్తలు