చైతన్య భారతి: పతాక యోధుడు.. పింగళి వెంకయ్య

2 Aug, 2022 13:54 IST|Sakshi
భార్య రుక్మిణమ్మతో పింగళి వెంకయ్య

1876–1963

రెండో బోయర్‌ యుద్ధంలో పింగళి వెంకయ్యకీ, గాంధీజీకీ  స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్యోద్య్రమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు. దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్‌సాండ్‌ బంగారు గనుల మీద ఆధిపత్యం గురించి ఆఫ్రికన్‌లు (బోయర్లు) చేసిన తిరుగుబాటుకే బోయర్‌ యుద్ధమని పేరు. దక్షిణాఫ్రికా రిపబ్లిక్, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌లు బ్రిటిష్‌ జాతితో చేసిన యుద్ధమిది.

ఆ యుద్ధంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్‌ ఇండియన్‌ అంబులెన్స్‌ దళాన్ని ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య బ్రిటిష్‌ సైనికునిగా అదే యుద్ధంలో పాల్గొన్నారు. తరువాత ఇద్దరూ స్వదేశం చేరుకుని స్వరాజ్యం కోసం పోరాడారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1921లో గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమానికి ఒక పతాకం అవసరమని భావించారు.

ఆ పని పింగళి వెంకయ్యకు తనకు తానై స్వీకరించారు.  1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నారు. జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి ఆయన వెంకయ్యగారికి సూచించారు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్‌ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్‌ ధర్మచక్రాన్ని సూచించారు.

‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉన్నది. బ్రిటిష్‌ వాళ్లు వారి జెండా యూనియన్‌ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన  త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణాతీరంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1963 జూలై 4న బెజవాడలో పేదరికంతో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు. 

మరిన్ని వార్తలు