పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం

6 Jun, 2022 13:47 IST|Sakshi

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15). మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేదని అంటారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారని అంటారు. 

1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రావిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్య్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టి ఆ స్వాతంత్య్రోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా ఆయన వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. అయితే 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేరు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, శ్రీరాములు హరిజనోద్ధరణకు పాటు పడ్డారు. దీని గురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను చూసి పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు.

మరిన్ని వార్తలు