మహోజ్వల భారతి

10 Jul, 2022 16:45 IST|Sakshi

లౌకిక జాతీయవాది
వాక్కోమ్‌ మజీద్‌ భారత స్వాతంత్య్ర సమర యోధులు. రాజకీయ నాయకులు. ట్రావంకూర్‌–కొచ్చిన్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా చేశారు. ట్రావంకోర్‌లోని అతి సంపన్న ముస్లిం కుటుంబంలో మజీద్‌ జన్మించారు. కుటుంబ సభ్యుల ప్రేరణ, ప్రోత్సాహాలతో సామాజిక, రాజకీయ సంస్కరణ ఉద్యమాలలో, స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ట్రావంకోర్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ బలపడేందుకు కారణమైన జాతీయ వాదులలో మజీద్‌ ఒకరు. 20 వ శతాబ్దపు భారతదేశపు గొప్ప జాతీయవాదులలో ఒకరు అని కూడా ఆయన గుర్తింపు పొందారు. లౌకిక, మానవీయ విలువలే ఆయన రాజకీయాలకు పునాది. మజీద్‌ 2002 జూలై 10 న తన 90 ఏళ్ల వయసులో మరణించారు. 

మతాంతర నృత్యకారిణి
జొహ్రా సెహ్గల్‌ నటి, నర్తకి, కొరియో గ్రాఫర్‌. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత. ఉత్తరప్రదేశ్, రాంపూర్‌లోని ఒక సంప్ర దాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు. జొహ్రా తన చిన్నతనంలోనే తల్లిని కోల్పో యారు. జోహ్రా 1940 అల్మోరాలోని ఉదయ్‌ శంకర్‌ ఇండియా సాంస్కృతిక కేంద్రంలో ఉపాధ్యాయు రాలిగా పనిచేశారు. అక్కడే తన కాబోయే భర్త యువ శాస్త్రవేత్త, చిత్రకారుడు కామేశ్వర్‌ సెగల్‌ను కలుసుకున్నారు. ఇద్దరూ నిష్ణాతులైన నృత్యకారులు, కొరియోగ్రాఫర్లు అయ్యారు.  కామేశ్వర్‌ సెహగల్‌ అనే హిందువును వివాహం చేసుకోడానికి మొదట్లో ఆమె తల్లిదండ్రులు విముఖత చూపారు. తర్వాత అంగీకరించారు. నేడు జోహ్రా వర్ధంతి. 2014 జూలై 10న 102 సంవత్సరాల వయస్సులో మరణించారు.

ఇంగ్లిష్‌ మాస్టార్‌
గురునాథ్‌ అబాజీ కులకర్ణి మరాఠీ రచయిత. సాహిత్య అకాడమీ గ్రహీత. నేడు ఆయన జయంతి. కులకర్ణి 1923 జూలై 10న కర్ణాటకలో జన్మించారు. ఇంగ్లిషు భాషలో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, ఇంగ్లిష్‌ భాషా బోధనవైపు వెళ్లారు. కులకర్ణికి దృష్టి లోపం ఉండేది. కళ్లకు చికిత్స చేయించుకోవడం కోసం ఆయన బెల్గామ్‌ నుంచి అయిష్టంగానే పుణె వెళ్లారు. అక్కడి కోత్రుడ్‌ రోడ్డులో చాలాకాలం ఉన్నారు. ఆయన మరణానంతరం ఆ రోడ్డుకు జి.ఎ.రోడ్డు అని పేరుపెట్టారు. పుణె వెళ్లడం ఆయనకు ఎందుకు ఇష్టం లేదంటే బెల్గామ్, ధర్వాడ్‌లు ఆయనకు నచ్చిన ప్రదేశాలు. వాటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. సునీతా దేశ్‌పాండే, మాధవ్‌ అఛావల్, జవంత్‌ దాల్వీ వంటి సృజనశీలురతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం.

విజ్ఞాన మహాపాత్ర
గోకులానంద మహాపాత్ర శాస్త్రవేత్త. సైన్స్‌ఫిక్షన్‌ రచయిత. ఒరియా భాషలో 95 కు పైగా సైన్స్‌ పుస్తకాలు రాశారు. వాటిలో కేవలం పిల్లల కోసం శాస్త్రవిజ్ఞానికి కల్పనను జోడించి రాసినవీ ఉన్నాయి. ‘కృత్రిమ ఉపగ్రహ’, ‘ప్రిథిబి బహారె మనిష’, ‘చంద్ర రా మృత్యు’, ‘నిశ్శబ్ద గోధూళి’, ‘మేడమ్‌ క్యూరీ’, ‘నీల చక్ర బల సపరే’ వంటివి పాఠకుల ఆదరణను పొందాయి. మహాపాత్ర ‘ఒడిశా విజ్ఞాన ప్రచార సమితి’ వ్యవస్థాపక సభ్యులు కూడా. మహాపాత్ర ఒడిశాలోని భద్రక్‌లో జన్మించారు. కలకత్తా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశారు. రేవన్హా యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ హెడ్డుగా రిటైర్‌ అయ్యారు.  నేడు ఆయన వర్ధంతి. 2013 జూలై 10న 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 

మరిన్ని వార్తలు