జైహింద్‌ స్పెషల్‌: 47కు 32 ఏళ్ల ముందే భారత్‌కు స్వాతంత్య్రం!

13 Jul, 2022 13:38 IST|Sakshi
విదేశీ ప్రతినిధులతో ఆఫ్గాన్‌ తాత్కాలిక భారత ప్రభుత్వ అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్‌ (మధ్యలో)

భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు పలువురు వీరులు వివిధ మార్గాల్లో దశాబ్దాలపాటు పోరాడారు. కొందరు అహింసా మార్గం, మరికొందరు పోరాట మార్గంలో పయనించగా ఇంకొందరు దౌత్యమార్గంలో దేశ స్వాతంత్రం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రపంచంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఉన్న ఇతర దేశాల మద్దతు సంపాదించి ఇండియాలో బ్రిటిష్‌ రాజ్‌ను కూలదోయాలని ప్రవాసీ భారతీయులు చాలామంది చాలా రకాల మార్గాలను అనుసరించారు. ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్న వారికి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అఫ్గనిస్థాన్‌ ఒక అవకాశంగా దక్కింది!
చదవండి: స్వతంత్ర భారతి: బోఫోర్స్‌ కుంభకోణం

అక్కడ మనవాళ్లు ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్‌లకు వ్యతిరేకంగా ఉన్న దేశాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒకదశలో ఇండియాలో తమ పాలన అంతమవుతుందన్నంత భయాన్ని బ్రిటిషర్లలో ఈ ప్రభుత్వం రేకెత్తించింది. కానీ చివరకు అఫ్గాన్‌ అమీర్‌ బ్రిటిష్‌ ఒత్తిడికి తలొగ్గడంతో ప్రవాస భారత ప్రభుత్వం అర్ధంతరంగా ముగిసింది. అయితే ఆ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని పూర్తిగా సాధించలేకున్నా భారతీయ ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచేందుకు, వివిధ దేశాల్లో భారతదేశం పట్ల సానుభూతి పెరిగేందుకు దోహదం చేసింది.

అలా మొదలైంది
భారత స్వాతంత్య్రం కోసం అఫ్గన్‌ అమీర్, రష్యా జార్‌; చైనా, జపాన్‌ల మద్దతు సంపాదించే లక్ష్యంతో టర్కీ, జర్మనీ సహకారంతో పలువురు ప్రవాస భారతీయులు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారతీయ జాతీయవాదులు, ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్న భారతీయ విప్లవకారులు జర్మనీ ఆర్థిక సహాయంతో భారత జాతీయోద్యమాన్ని ఉద్ధృతం చేయవచ్చని భావించారు. వీరి ప్రయత్నాల్లో భాగంగా బెర్లిన్‌–ఇండియన్‌ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ బ్రిటిషర్లపై దాడి చేసేందుకు గిరిజనులను ప్రోత్సహించడం కోసం ఇండో–ఇరానియన్‌ సరిహద్దు వద్దకు ఒక ఇండో–జర్మన్‌–టర్కిష్‌ బృందాన్ని పంపింది.

మరోవైపు దేవ్‌బందీ మౌలావి ఉబైద్‌ అల్లా సింధీ, మహమూద్‌ అల్‌ హసన్‌ నేతృత్వంలో మరొక బృందం 1915 అక్టోబరులో భారతదేశంలోని గిరిజన ప్రాంతంలో ముస్లిం తిరుగుబాటును ప్రారంభించే ప్రణాళికలతో కాబూల్‌కు వెళ్లింది. ఈ రెండు బృందాలు 1915 డిసెంబర్‌ 1న కలుసుకొని రాజా మహేంద్ర ప్రతాప్‌ అధ్యక్షుడిగా తొలి భారతీయ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వంలో మౌలానా బర్కతుల్లా ప్రధానమంత్రిగా, దేవబందీ మౌలావి ఉబైద్‌ అల్లా సింధీ హోం మంత్రిగా, దేవబందీ మౌలావి బషీర్‌ యుద్ధ మంత్రిగా, చంపక్రామన్‌ పిళ్లై విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వానికి ఆఫ్ఘన్‌ ప్రభుత్వం నుండి అంతర్గతంగా గణనీయమైన మద్దతు లభించింది. అయితే అమీర్‌ హబీబుల్లా మాత్రం బహిరంగంగా మద్దతు ప్రకటించడానికి నిరాకరించాడు. అయినప్పటికీ అఫ్గాన్‌ లోని పత్రికలు, ఇతర ప్రముఖులు ప్రవాస భారతీయ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం విశేషం. 

విదేశీ సాయం కోసం  
1917 లో రష్యాలో ఫిబ్రవరి విప్లవం తరువాత, మహేంద్ర ప్రతాప్‌ ప్రభుత్వం కొత్త సోవియట్‌ ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుంది. 1918 లో మహేంద్ర ప్రతాప్‌ బెట్రోలిన్‌ లో జర్మన్‌  కైసర్‌ను, పెట్రోగ్రాడ్‌లో లియోన్‌ ట్రాట్సీకని (సోవియట్‌ నాయకుడు) కలుసుకున్నారు. బ్రిటిషు ఇండియాకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అతడు వారిద్దరినీ కోరాడు.  సిరాజ్‌–ఉల్‌–అక్బర్‌ అనే పత్రిక 1916 మే 4 సంచికలో ప్రభుత్వ ఉద్దేశాల గురించి రాజా మహేంద్ర ప్రతాప్‌ రాసిన వ్యాసం ప్రచురించింది. ‘‘జర్మన్‌  కైజర్‌ స్వయంగా నాకు దర్శనమిచ్చాడు.

ఇంపీరియల్‌ జర్మన్‌ ప్రభుత్వంతో భారతదేశం, ఆసియా సమస్యపై చర్చించి తగిన మద్దతు పొందాక నేను తూర్పు వైపు ప్రయాణం ప్రారంభించాను. ఈ ప్రయాణంలో ఈజిప్ట్‌ ఖేదీవ్‌తో, టర్కీ యువరాజులు, మంత్రులతో, అలాగే ప్రఖ్యాత ఎనీవర్‌ పాషాతో, పవిత్ర ఖలీఫ్, సుల్తాన్‌–ఉల్‌–మువాజిమ్‌తో సంప్రదింపులు జరిపాను. నేను భారతదేశపు అంశాన్ని ఒట్టోమన్‌ ప్రభుత్వంతో చర్చించాను.

వారి నుండి అవసరమైన గుర్తింపును కూడా పొందాను. జర్మనీ, టర్కీ అధికారులు, మౌల్వీ బరాకతుల్లా సాహిబ్‌  ఇప్పటికీ నాతోనే ఉన్నారు’’ అని ప్రతాప్‌ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ప్రవాస ప్రభుత్వ యత్నాలను బ్రిటన్‌  అన్ని రకాలుగా అడ్డుకుంది. తొలుత సాయం చేస్తానన్న అమీర్‌ చివర్లో బ్రిటన్‌  ఒత్తిడికి తలొగ్గి మద్దతు ఉపసంహరించుకున్నాడు. దీంతో ప్రవాస ప్రభుత్వం మూతపడింది, అందులో సభ్యులు బ్రిటీష్‌వారి నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్లారు. 

పరోక్ష ప్రభావం
ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు ఏర్పాటైన ప్రవాస భారతీయ ప్రభుత్వం మూడు నాలుగేళ్లు మాత్రమే ఉనికిలో ఉంది. అయితే ఈ ప్రభుత్వం, దీని సూచనలు అటు ఇండియాలో ఇటు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాలు చూపాయి. అఫ్గన్‌లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనందుకు నిరసనగా పలు రాజకీయ మార్పులు జరిగి చివరకు అమీర్‌ హత్యకు, అటు తర్వాత మూడో ఆంగ్లో అఫ్గన్‌ యుద్ధానికి, చివరగా అఫ్గన్‌ స్వాతంత్య్రానికి దారి తీశాయి. ఈ ప్రభుత్వ ఏర్పాటు భారతదేశంలో రాజకీయ పురోగతిని ప్రభావితం చేసిందని చాలా మంది చరిత్రకారులు భావించారు.

బ్రిటిష్‌ ఇండియా సరిహద్దుల్లోనే ప్రతాప్‌ ప్రభుత్వం ఉండటం, బోల్షివిక్‌ సహాయం కోరుతూ ప్రతాప్‌ తాత్కాలిక ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు.. భారతదేశంలో తమ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా బ్రిటిషర్లు భయపడ్డారు. దీంతో రౌలత్‌ కమిటీ ఏర్పాటు చేసి భారతదేశంలో మిలిటెంట్‌ ఉద్యమాల మధ్య ఉన్న సంబంధాలను అంచనా వేశారు బ్రిటిషర్‌లు. ఈ కమిటీ సిఫారసులపై ఆధారపడి బ్రిటిషు ప్రభుత్వం భారత రక్షణ చట్టం 1915 కు పొడిగింపుగా రౌలత్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి వ్యతిరేకంగా జలియన్‌ వాలాబాగ్‌లో ఏర్పాటైన సమావేశంపై డయ్యర్‌ విచక్షణారహితంగా కాల్పులు జరపడం భారతీయులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తత్ఫలితంగా దేశ స్వాతంత్రోద్యమం మరింత వేగం పుంజుకుంది. 
– దుర్గరాజు శాయి ప్రమోద్‌ 

మరిన్ని వార్తలు