పోరు బాట.. అగ్గిబరాటా

3 Jun, 2022 16:17 IST|Sakshi
‘స్వదేశీ ఉద్యమం’లో గాంధీజీ. ఇదే బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం; వైశ్రాయ్‌ కర్జన్‌

స్వరాజ్య సాధన కోసం నిర్మించుకున్న ఆధునిక రాజకీయ పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన తొలి అడుగు. డిసెంబర్‌ 28,1885న ఇది ఆవిర్భవించింది. ఇందుకు దోహదం చేసిన ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ చైతన్యం తేవడానికి పనిచేసినవే.

ల్యాండ్‌ హోల్డర్స్‌ సొసైటీ (1836, కలకత్తా, ద్వారకానాథ్‌ టాగూర్‌ స్థాపించారు), బ్రిటిష్‌ ఇండియా సొసైటీ (1839, లండన్‌ , విలియం ఆడమ్‌), బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సొసైటీ (1843, కలకత్తా), బ్రిటిష్‌ ఇండియా అసోసియేషన్‌ (1852, కలకత్తా ద్వారకానాథ్‌ టాగూర్‌), మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌  (1852, మద్రాస్, గాజుల లక్ష్మీనరసుచెట్టి), బాంబే అసోసియేషన్‌ (1852,బొంబాయి, జగన్నాథ్‌ శంకర్‌ సేథ్‌), ఈస్టిండియా అసోసియేషన్‌  (1866, లండన్‌ , దాదాభాయ్‌ నౌరోజీ), నేషనల్‌ ఇండియన్‌  అసోసియేషన్‌  (1867, లండన్‌ , మేరీ కార్పెంటర్‌), పూనా సార్వజనిక్‌ సభ (1876, పూనా, ఎంజి రేనడే, జీవీ జోషి, ఎస్‌హెచ్‌ చిప్లుంకర్‌), ఇండియన్‌  సొసైటీ (1872, లండన్‌, ఆనందమోహన్‌  బోస్‌) ఇండియన్‌ అసోసియేషన్‌ (1876, కలకత్తా, సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌మోహన్‌ బోస్‌), మద్రాస్‌ మహాజన సభ (1884, మద్రాస్, ఎం. వీరరాఘవచారి, జి. సుబ్రహ్మణ్య అయ్యర్, పి.ఆనందాచార్యులు), బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌  (1885, బొంబాయి, ఫిరోజ్‌షా మెహతా, కేటీ తెలాంగ్, బద్రుద్దీన్‌  తాయబ్జీ).. వంటి వన్నీ  స్వరూజ్య చింతనకు భూమికను ఇచ్చినవే.

సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ (1905, పూనే, గోఖలే)  కూడా అలాంటి సేవ చేసింది. చరిత్రలో సక్రమంగా నమోదు కాకున్నా తీవ్ర జాతీయవాద ఉద్యమం తనదైన ఉనికిని చాటుకున్న మాట నిజం. మిత్ర మేళా (1899, నాసిక్‌), అనుశీలన్‌  సమితి (1902, బెంగాల్‌), అభినవ్‌ భారత్‌ (1904, పూనా), స్వదేశీ బాంధబ్‌ సమితి (1905, బెంగాల్‌), ఇండియన్‌  హోంరూల్‌ సొసైటీ, (1905, లండన్‌ ), ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ (1907, అమెరికా) గదర్‌ పార్టీ (1913, అమెరికా), జుగాంతర్‌ పార్టీ (1914, బెంగాల్‌), బెర్లిన్‌  కమిటీ ఫర్‌ ఇండియన్‌  ఇండిపెండెన్స్‌ (1915, జర్మనీ) సంస్థలు నాటి భారతీయ యువతరం మీద గట్టి ప్రభావాన్ని చూపిన సమయమది.

జర్మన్‌ కుట్ర.. బెంగాల్‌ పుట్ర
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ విప్లవకారుల సాయంతో భారత్‌లోని బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక జాతీయ స్థాయి సాయుధ పోరు నిర్వహించాలని గదర్‌ పార్టీ పథకం వేసింది. దీనికే హిందూ జర్మన్‌ కుట్ర అని పేరు. ఇది కూడా భారతీయ యువతరం మీద నాడు విశేషమైన ప్రభావం చూపింది. జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదుల ఉద్యమ పంథాయే ఇలాంటి ఒక అగ్నివర్షాన్ని కురిపించింది. నిజానికి భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వం అతివాదుల చేతులలోకి రావడానికి కారణం మితవాదుల ధోరణి. ఈ మార్పుకు అవకాశం ఇచ్చిన చారిత్రక పరిణామమే బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం లేదా స్వదేశీ ఉద్యమం (1905–1911). 

కర్జన్‌ విభజన.. ఉద్యమ గర్జన
పాలనా సౌలభ్యం పేరుతో జూలై 19,1905 న వైస్రాయ్‌ కర్జన్‌  బెంగాల్‌ విభజనను ప్రకటించాడు. అక్టోబర్‌ 16న విభజన అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది బ్రిటిష్‌ జాతి ముద్ర స్పష్టంగా ఉన్న విభజించు పాలించు చర్య. జాతీయోద్యమంలో కీలకంగా ఉన్న బెంగాలీలను విభజించడంతో పాటు, హిందువులను ముస్లింలను విడదీయడం ఈ చర్య ఉద్దేశంగా కనిపిస్తుంది. 

7 కోట్ల 80 లక్షల 50 వేల జనాభాతో కూడిన పెద్ద ప్రెసిడెన్సీ బెంగాల్‌. మొత్తం బెంగాల్, బిహార్, ఒరిస్సా, అస్సాం ఇందులో ఉండేవి. అస్సాం ప్రత్యేక అధికారి పాలనలో మాత్రం ఉండేది. తూర్పు బెంగాల్‌లోని 15 జిల్లాలు, బిహార్, ఒరిస్సాలను కలిపి ఒక భాగం, మిగిలిన బెంగాల్, అస్సాం ఒక ప్రాంతంగాను విభజించారు. తూర్పు బెంగాల్‌ రాజధానిగా ఢాకాను ప్రకటించారు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ. మొత్తంగా రెండింటిలోనూ బెంగాలీలు అల్ప సంఖ్యాకులుగా మారారు. ఈ విధంగా కాకుండా, బెంగాల్‌ భాష మాట్లాడేవారితో ఒక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని సురేంద్రనాథ్‌ బెనర్జీ వంటివారు వాదించారు. ఇంతకీ ఈ రాజకీయ సంక్షోభం సృష్టించిన వైస్రాయ్‌ కర్జన్‌   పదవి.. విభజన ప్రకటన తరువాత మూడువారాలకే (ఆగస్ట్‌ 16) పోయింది. అయినా ఉద్యమ సెగను చవి చూశాడు.
– డా.గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు