Azadi Ka Amrit Mahotsav: పంజాబ్‌లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు

15 Aug, 2022 06:12 IST|Sakshi

చండీగఢ్‌: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్‌ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మద్దతుంది.

అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్‌స్టర్లు అర్‌‡్ష డల్లా, గుర్జంత్‌ సింగ్‌లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

జైషే ఉగ్రవాది అరెస్టు
లఖ్‌నవూ: జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్‌ ఇస్లాం అలియాస్‌ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్‌ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్‌ బీజేపీ నేత నుపుర్‌ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్‌ నదీమ్‌ను ఇటీవల ఏటీఎస్‌ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్‌ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్‌తో పాటు పాక్, అఫ్గాన్‌కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది.

మరిన్ని వార్తలు