జైహింద్‌ స్పెషల్‌: ఖిస్సా ఖ్వానీ బజార్‌ ఊచకోత

12 Jun, 2022 12:46 IST|Sakshi
పేష్వార్‌లోని ఖిస్సా ఖ్వానీ బజార్‌లో నిరాయుధులైన ప్రదర్శనకారులపై కాల్పులు జరపడానికి తుపాకీ గురిపెట్టిన బ్రిటిష్‌ భారత సైన్యం

బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి కోసం భారతదేశంలో ఎగసిపడిన చిన్న నిప్పు రవ్వ కూడా స్వాతంత్య్ర సమరజ్వాలకు ఆజ్యం పోసినదే. నేటి పాకిస్థాన్‌లోని ఖిస్సా ఖ్వామీ బజార్‌లో 90 ఏళ్ల క్రితం 1930 ఏప్రిల్‌లో చెలరేగిన అలాంటి జ్వాలే ఒకటి భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తన వంతుగా నిప్పందించింది. ఆనాటి ఘటనకు ఈనాటి చేదు జ్ఞాపకమే.. ‘ఖిస్సా ఖ్వానీ బజార్‌ ఊచకోత’. నేటి పాకిస్థాన్‌లోని ప్రస్తుత  ప్రావిన్సులలో ఒకటైన ఖైబర్‌ పక్తున్‌క్వా రాజధాని పెషావర్‌లోని ఒక వీధి పేరే ఖిస్సా ఖ్వానీ. ఖిస్సా ఖ్వానీ అంటే ‘కథలు చెప్పేవాళు’్ల అని. మన బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ సరిగ్గా నూరేళ్ల క్రితం ఆ ఖిస్సా ఖ్వానీ వీధిలోనే జన్మించారు! మరో నటుడు రాజ్‌ కపూర్‌ పుట్టింది కూడా ఖిస్సా ఖ్వానీలోనే. షారుక్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులు కొందరు కూడా ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు.

ఆ వీధికి ఇంతకుమించి ఉన్న చారిత్రక గుర్తింపు మాత్రం అక్కడ జరిగిన ఊచకోతే. ఆ రోజు.. ఏప్రిల్‌ 23 న ఖిస్సా ఖ్వానీలో ‘ఖుదాయి కిద్మత్గార్‌’ ఉద్యమకారులు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా అహింసాయుత ప్రదర్శన జరుపుతున్నారు. వారి నాయకుడు అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌. ఖుదాయీ కిద్మత్గార్‌ (దేవుని సేవకులు) ఉద్యమకర్త ఆయనే. నాటి వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని ఉత్మాన్‌జాయ్‌ పట్టణంలో గఫార్‌ ఖాన్‌ తన ప్రసంగం పూర్తి చేసి వేదిక కిందికి దిగుతుండగానే గఫార్‌ ఖాన్‌ను, మరికొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రదర్శనా స్థలానికి చేరుకున్న బ్రిటిష్‌ బలగాలు 

అందుకు నిరసనగానే అనేక ప్రాంతాలతో పాటు ఖిస్సా ఖ్వానీలోనూ ప్రదర్శనలు జరిగాయి. గఫార్‌ ఖాన్‌ను తక్షణం విడుదల చేయాలని ప్రదర్శనకారులు నినాదాలిచ్చారు. ‘గుమికూడి ఉన్న మీరంతా తక్షణం నినాదాలు మాని ఎవరిదారిన వారు వెళ్లకుంటే తగిన సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అని ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన బ్రిట్రిష్‌ సైనిక బలగాలు హెచ్చరించాయి. ఆ బలగాలలో ఉన్నది కూడా భారతీయులే. ప్రదర్శనకారులు కదల్లేదు. సైనికులు తుపాకులు తీశారు. ప్రదర్శనకారులు బెదరలేదు. 

దాంతో సైనిక వాహనాలు క్రూరాతిక్రూరంగా వారిని తొక్కిపడేశాయి. ఆ ఘటనలో ప్రదర్శనకారులతో పాటు, నిలబడి చూస్తున్న కొందరు పౌరులు కూడా అక్కడికక్కడే మరణించారు. తుపాకీ కాల్పులకు మరికొందరు ప్రాణాలు వదిలారు. ఆ బలగాలు ‘గర్వాల్‌ రెజిమెంట్‌’వి. అందులోని కొందరు సైనికులు నిరాయుధులైన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు నిరాకరించారు. కానీ పైనుంచి ఆదేశాలు రావడంతో రెజిమెంట్‌లోని మిగతా సైనికులు తమ ‘డ్యూటీ’ తాము చేసేశారు. కాల్పులు జరిపేందుకు నిరాకరించిన సైనికులపై బ్రిటిష్‌ అధికారులు ఆ తర్వాత సైనిక విచారణ జరిపించి ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధించారు.

ఊచకోత తర్వాత కూడా పెషావర్, ఆ పరిసర ప్రాంతాలలో ఖుదాయి కిద్మత్గార్‌ కార్యకర్తలు తీవ్రమైన అణచివేతలను ఎదుర్కొన్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ .. ‘హింసాత్మకమైన ఉద్యమకారుడికన్నా, అహింసాయుతంగా పోరాడుతున్న ఒక పష్తూన్‌ తెగ మనిషి ఎక్కువ ప్రమాదకారి అని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించినట్లుంది..’ అని గఫార్‌ ఖాన్‌ రాశారు. ఈ కారణంగానే తరచు తమ ఉద్యమం తేలికపాటి ప్రదర్శనకే భగ్గుమనేటంతటి ఘర్షణగా మారేది అని కూడా రాసుకున్నారు.

ఖిస్సా ఖ్వామీ ఊచకోత దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. దేశంలో తిరుగుబాటు ధోరణులు వ్యాప్తి చెందాయి. ఖిస్సా ఖ్వామీ ఊచకోత విషయం బ్రిటన్‌ రాజు ఆరవ జార్జి దృష్టికి వెళ్లి, ఘటనపై ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. నాటి లక్నో ప్రొటెక్టరేట్‌కు చెందిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నైమతుల్లా చౌదరికి కేసు బాధ్యతను అప్పగించారు. ఆయన ఘటనాస్థలి వద్దకు అనేకమార్లు స్వయంగా వెళ్లి, సాక్షులతో మాట్లాడి ‘బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీ’దే తప్పు అంటూ.. 200 పేజీల నివేదికను రాజుకు సమర్పించారు. రాజు ఆయన నిబద్దతను గుర్తించి, గౌరవించారు.

ఖుదాయీ కిద్మత్గార్‌ దేశ విభజనను వ్యతిరేకించింది. అయితే స్వతంత్ర పాకిస్తాన్‌ ఏర్పడేందుకు అలాంటి వ్యతిరేకత ప్రతికూలాంశమౌతుందని ఎక్కువశాతం పాక్‌ నాయకులు భావించారు. అబ్డుల్‌ గఫార్‌ఖాన్‌కు ఇష్టం లేకుండానే ఒక దేశం రెండు దేశాలుగా విడిపోయింది. ఖిస్సా ఖ్వామీ ఊచకోత.. స్వాతంత్య్ర సంగ్రామాల జ్ఞాపకాల్లోంచి కాలంతో పాటు దాదాపుగా కరిగిపోయింది.

మరిన్ని వార్తలు