జైహింద్‌ స్పెషల్‌: జాతీయ గీతానికి ‘మదన’పల్లె రాగం

13 Jun, 2022 11:50 IST|Sakshi
1942 సెప్టెంబర్‌ 11న జర్మనీలోని హాంబర్గ్‌లో ఏర్పాటైన ఐ.ఎన్‌.ఎ. సమావేశంలో ప్రసంగిస్తున్న సుభాస్‌ చంద్రబోస్‌. ఈ సమావేశంలోనే బోస్‌ తొలిసారిగా ‘జనగణమన’ ను భారతదేశ జాతీయ గీతంగా ప్రకటించి, అక్కడివారితో పాడించారు ; (ఇన్‌సెట్‌) రవీంద్రనాథ్‌ టాగూర్‌

గురుదేవులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (1861–1941) బెంగాలీ భాషలో రచించిన ‘జనగణమన’ గీతాన్ని మదనపల్లెలో ఇంగ్లీష్‌ లోకి అనువదించారనీ, అక్కడే ఆ గీతానికి రాగాలు కట్టారని చరిత్ర చెబుతోంది! ఏమిటి మదనపల్లెకు, ఠాగూరు గీతానికి సంబంధం? కేవలం 52 సెకన్ల నిడివి గల ‘జనగణమన’ గీతాన్ని స్వాతంత్య్రం పొందిన భారతదేశం 1950 జనవరి 24న జాతీయగీతంగా స్వీకరించింది. తొలి రిపబ్లిక్‌ దినోత్సవానికి రెండు రోజుల ముందు అన్నమాట! 

రాగానికి ముందే గానం
కలకత్తాలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో 1911 డిసెంబర్‌ 27న తొలిసారి ఈ గీతాన్ని (ఓ పెద్ద సమావేశంలో) పాడారు. అంతకుముందు పాట సిద్ధమయ్యాక 1911 డిసెంబర్‌ 11న రిహార్సల్స్‌ చేసినప్పుడు పాడారు. తర్వాత 1912 జనవరిలో కలకత్తాలో జరిగిన బ్రహ్మ సమాజం ప్రార్థనా సమావేశంలో (మూడోసారి) పాడారు. అంతేకాక బ్రహ్మ సమాజం వారి తత్వబోధిని పత్రిక 1912 జనవరి సంచికలో ఈ గీతం అచ్చయ్యింది. ఠాగూరు మేనకోడలు సరళాదేవి చౌదరి 1912లో పాడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ కలకత్తాలోనే జరిగాయి. ఆ పాట బెంగాలీ భాషలో పాడబడింది. 1913లో సాహిత్యపు నోబెల్‌ బహుమతి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘గీతాంజలి’ రచనకు రావడం మరో విశేషం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే తొలి నోబెల్‌ బహుమతి!

దక్షిణాదికి ‘దివ్యజ్ఞానం’
1914లో బాలగంగాధర తిలక్‌ మహాశయుడు పూనా పట్టణంలో ‘హోమ్‌ రూల్‌ లీగ్‌’ ను స్థాపించి ఉద్యమంగా చేపట్టారు. అనిబిసెంట్‌ కు ఇది బాగా నచ్చింది. దక్షిణాదిలో ఇలాంటి ఉద్యమాన్ని అదే పేరుతో 1916లో ప్రారంభించారు. దీనికి ముందే అనిబిసెంట్‌ పూనికతో ‘దివ్యజ్ఞాన సమాజం’ మద్రాసులో ఏర్పడి, మంచి వనరులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంతో 1915లో మదనపల్లెలో బీసెంట్‌ థియోసాఫికల్‌ కళాశాల (బి.టి.కాలేజి) స్థాపించారు. అంతకుముందు ఇండియన్‌ బాయ్స్‌ స్కౌట్‌ మూవ్‌మెంట్, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ స్కీమ్‌ నిర్వహించి, ఆ ప్రాంతానికి కళాశాల అవసరమని భావించి, దివ్యజ్ఞాన సమాజం వారు మదనపల్లెలోనే ప్రారంభించారు. ధర్మవరం, మదనపల్లె, చిత్తూరు, చంద్రగిరి, కడప వంటిచోట్ల థియోసాఫికల్‌ సొసైటీ వారి లాడ్జిలు (కేంద్రాలు) ఏర్పడ్డాయి.  

మదనపల్లెకు ఠాగూర్‌ 
తెలుగు ప్రాంతాలలో హోమ్‌ రూల్‌ ఉద్యమం దివ్యజ్ఞాన సమాజం వ్యక్తుల చేయూతతో పుంజుకుంది. హోమ్‌ రూల్‌ ఉద్యమ వ్యాప్తికి ’ఆంధ్ర తిలక్‌’ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసిన కృషి విశేషమైనది. బి.టి.కళాశాల విద్యార్థులు హోమ్‌ రూల్‌ ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు వివిధ ప్రాంతాలలో అందజేసేవారు. బ్రిటిష్‌ వారికిది కంటగింపుగా తయారైంది. ఫలితంగా 1917 జూన్‌ 16న బి.పి. వాడియా, జి.ఎస్‌.ఆరండేల్‌ తో కలసి అనిబిసెంట్‌ ను అరెస్టు చేశారు.

ఈ సమయంలో బి.టి. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సమావేశాలకు బి.టి. కళాశాల కేంద్ర బిందువు అయ్యింది. ఈ విషయాలను బ్రిటిషు ప్రభుత్వం గుర్తు పెట్టుకుంది. 1917 సెప్టెంబరులో అనిబిసెంట్, ఆమె సహచరులు కారాగారం నుంచి విముక్తులయ్యారు. కానీ, బి.టి. కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలయపు అనుబంధాన్ని రద్దు చేశారు. ఈ సమయంలో అనిబిసెంట్‌ విభిన్నంగా ఆలోచించి రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ నిర్వహించే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేశారు. ఇదీ నేపథ్యం! కనుకనే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మదనపల్లెను సందర్శించారు.

గురుదేవుని గీతాలాపన
గురుదేవులు 1919లో మదనపల్లె వచ్చినపుడు బి.టి. కళాశాలలోని బిసెంట్‌ హాల్‌ లో ఫిబ్రవరి 28న ‘జనగణమన’ గీతాన్ని స్వయంగా పాడారు. ఆ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ గా పనిచేస్తున్న మార్గరెట్‌ కజిన్‌ (Mrs Margaret Cousins) ఈ గీతాన్ని ఠాగూర్‌ సలహాల మేరకు పాశ్చాత్య బాణిలో రాగాలు రాశారు. మార్గరెట్‌ కజిన్స్‌ ఐరిష్‌ కవి డా. జేమ్స్‌ కజిన్స్‌ శ్రీమతి. ఈ సంగతులన్నీ డా. జేమ్స్‌ కజిన్స్‌ రాసిన ఆత్మకథ ‘వుయ్‌ టు టుగెదర్‌’ అనే గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి! అదే సమయంలో ఠాగూర్‌ ‘జనగణమన’ బెంగాలి గీతాన్ని ‘ది మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా’గా తనే ఆంగ్లంలోకి అనువదించారు. 2018–19 సమయంలో మదనపల్లెలోని బి.టి. కళాశాలలో ఈ అపురూప సంఘటనలకు శత వార్షిక ఉత్సవాలు జరిగాయి. కానీ కలకత్తా వెలుపల మొట్టమొదటిసారి ‘జనగణమన’ గీతం పాడబడింది మదనపల్లెలోనే. ఈ రకంగా మదనపల్లె పట్టణానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ ఊరితో మన జాతీయ గీతానికి సంబంధించి ఇన్ని సందర్భాలు ముడిపడి ఉన్నాయి. 

భారత్‌కు ముందే బోస్‌!
అప్పటికి ఈ గీతానికి పెద్ద ప్రాచుర్యం లేదు. 1935లో డెహ్రడూన్‌ స్కూల్‌ లో పాఠశాల గీతంగా స్వీకరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ తన ఐఎన్‌ఏ సమావేశంలో 1942 సెప్టెంబరు 11న ఈ పాటను భారతదేశపు జాతీయ గీతంగా పాడించారు. 1945 లో ‘హమ్‌ రహి’ సినిమాలో తొలిసారిగా వాడారు. ఠాగూర్‌ 1941లో గతించారు, ఈ గీతానికి సంబంధించి ఏ వైభవాన్నీ వారు చూడలేదు! ‘జనగణమన’ గీతచరిత్రలో మదనపల్లె చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది!
-డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు 

మరిన్ని వార్తలు