Raja Ram Mohan Roy Life History: రాజా రామ్‌ మోహన రాయ్‌ / 1772–1833

30 Jun, 2022 11:00 IST|Sakshi

విశ్వవాది సంస్కర్త

మూఢ నమ్మకాలు, మత దురభిమానం, అన్నీ దైవ నిర్ణయాలనే వాదం, బహుభారాత్వం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, పుట్టిన వెంటనే శిశువులను తల్లి అంగీకారంతో చంపే ఆచారం దేశ ప్రగతికి పెద్ద ప్రతిబంధకాలుగా పరిణమించిన 19వ శతాబ్దం అది. ఈ ఆచారాలను నిర్మూలించనిదే భారత ప్రజానీకానికి భవిష్యత్తు లేదన్న గ్రహింపు ఆరంభమైన కాలం కూడా అదే. 

ఆ గ్రహింపువల్ల ఆనాటి వలస ప్రభుత్వం కన్నా ఎక్కువ విప్లవాత్మక వైఖరితో వ్యవహరించారు మన సంస్కర్తలు కొందరు. అటువంటి యోధులలో రామ్‌ మోహన్‌ రాయ్‌ని అగ్రగణ్యునిగా చెప్పాలి. రామ్‌ మోహన్‌ రాయ్‌ 1772లో బెంగాల్‌లో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం వంగ, సంస్కృత భాషలలో సాగింది. తర్వాత పర్షియన్, అరబిక్‌ భాషలు నేర్చుకునేందుకు ఆయన పాట్నా వెళ్లారు. ఆ తర్వాతే ఆయన ఇంగ్లీషులోను, మరికొంత కాలానికి గ్రీకు, హిబ్రూ భాషలలోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఉపనిషత్తులను అధ్యయనం చేసిన తర్వాత భగవంతుడొక్కడే అనే భావన ఆయనలో మరింత బలపడింది. ఉపనిషత్తులలో కొన్నింటిని ఆయన ఆ తరువాత వంగ భాషలోకి అనువదించారు. ‘హేతుబద్ధత కలిగిన మతపరమైన భావాలను వ్యాప్తిలోకి తేవడానికి ఆయన 1814లో ‘ఆత్మీయ సభ’ను నెలకొల్పారు. 

సతీ సహగమనాన్ని నిర్మూలించడం కోసం ఉద్యమించారు. దీనిపై రామ్‌ మోహన్‌ రాయ్‌ చేసిన నిరంతర కృషి కారణంగానే, అప్పటి గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటిక్‌ సతీ సహగమనాన్ని నిషేధిస్తూ 1829లో చట్టం తెచ్చారు. రాయ్‌ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. మహిళలు విద్యావంతులు కావాలని కోరుకున్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించాలని కూడా ఆయన ఆనాడే వాదించారు. రామ్‌ మోహన్‌ రాయ్‌ విశ్వవాదం నేటి సామాజిక పరిస్థితులకూ వర్తిస్తుంది. 
– ఎస్‌.బి.ఉపాధ్యాయ్, ఐ.జి.ఎన్‌.ఓ.యు.లో చరిత్ర బోధకులు

మరిన్ని వార్తలు