ముక్కుసూటి ఉక్కుమనిషి- బిపిన్‌ చంద్ర పాల్‌ 

10 Jun, 2022 13:25 IST|Sakshi

చైతన్య భారతి: 1858–1932

బిపిన్‌ చంద్ర పాల్‌ గాంధీజీని విభేదించారు. అయితే ఆయన సాగించిన జాతీయోద్యమ పోరాటం గాంధీజీ లక్ష్యాలకు భిన్నమైనది మాత్రం కాదు. కాకపోతే గాంధీ మార్గాన్ని ఆయన నిస్పర్థగా అనుసరించలేకపోయారు. ఉద్యమాన్ని మతం, ఆధ్యాత్మికతలతో గాంధీజీ ముడిపెట్టడం ఉద్యమ శక్తిని పలుచన చేసి, దాన్నొక బలహీనతగా సామ్రాజ్యవాదికి చూపించే ప్రమాదం ఉందని పాల్‌ ఆందోళన చెందారు. 

ప్రతిఘటనకు పిడిగుద్దులు తప్ప సహాయ నిరాకరణ వంటి మధ్యేమార్గాలు ఉండకూడదన్నారు. అందుకే ఆయన ‘ఫాదర్‌ ఆఫ్‌ రివల్యూషనరీ థాట్స్‌’ గా ప్రఖ్యాతిగాంచారు. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్‌ భాగస్వామ్యం నిక్కచ్చిగా ఉండేది. సుప్రసిద్ధ తాత్విక చింతనాపరుడు శ్రీ అరబిందో ఆయన్ని మహాశక్తిమంతులైన జాతీయవాద ప్రవక్తలలో ఒకరిగా అభివర్ణించారు. 

అయితే పాల్‌ శక్తి ఆయన స్వభావంలో కాక, శాంతిని ప్రవచించే సైద్ధాంతిక ధోరణుల పట్ల అసహనంగా వ్యక్తం అయ్యేదని ఆయన వ్యతిరేకులు అనేవారు. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో 1905 నుండి 1918 వరకు బ్రిటిష్‌ ఇండియాలో జాతీయవాద త్రయంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన లాల్‌ బాల్‌ పాల్‌ (లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్‌ చంద్ర పాల్‌) లలో ఒకరైన పాల్‌ తన ఇరవై ఎనిమిదవ యేట భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 

తన జీవితకాలంలోని చివరి ఆరేళ్లు కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. పాల్‌ స్థాపించిన జాతీయోద్యమ ఆంగ్ల వార్తాపత్రిక ‘బందే మాతరం’  ఆయన్ని ఆర్నెల్ల పాటు జైల్లో ఉంచింది. అందులో అరబిందో రాసిన ఒక వ్యాసానికి సంబంధించి వ్యతిరేకంగా సాక్షం ఇవ్వనందుకు బ్రిటిష్‌ పాలకులు పాల్‌కు విధించిన శిక్ష అది. 

బిపిన్‌ చంద్ర పాల్‌  హబీగంజ్‌లోని (ఇప్పటి బంగ్లాదేశ్‌లోని ప్రాంతం) సంపన్న హిందూ వైష్టవ కుటుంబంలో జన్మించారు. రాజా రామ్‌ మోహన్‌రాయ్‌ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’లో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఒక వితంతువును వివాహమాడారు. 

ప్రముఖ నాటక, సినీ రచయిత, దర్శకుడు, ‘బాంబే టాకీస్‌’ వ్యవస్థాపకులలో ఒకరైన నిరంజన్‌ పాల్‌ ఈయన కుమారుడే. గాంధీజీకి దూరం అయిన కొద్దిమంది ముక్కుసూటి ఉక్కుమనుషుల్లో పాల్‌ కూడా ఒకరు. విమర్శించవలసిన సందర్భంలో మృదువుగా మాట్లాడడం ఉద్యమస్ఫూర్తిగా విఘాతంగా పరిణమిస్తుందని పాల్‌ నమ్మారు. చివరి వరకు ఆ నమ్మకం మీదే ఆయన నిలబడ్డారు.

మరిన్ని వార్తలు