-

శతమానం భారతి: లక్ష్యం 2047 ఉపాధి

18 Jun, 2022 15:43 IST|Sakshi

ఉపాధి కల్పనలోనూ వ్యవసాయరంగమే నేటికీ మనకు ప్రధాన ఆధారం!

జనాభా అధికంగా ఉండే భారత్‌ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాల కొరత సాధారణమే కానీ.. అయితే అసాధారణ స్థాయిలో నిరుద్యోగం పెను భూతంలా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. స్వాతంత్య్రానంతర కాలంలో ఉపాధి నైపుణ్యాలు లేనప్పటికీ పారిశ్రామికీకరణకు అప్పటికింకా మనం దూరంగా ఉన్నందు వల్ల సంప్రదాయ ఉపాధి అవకాశాలతోనే దేశంలోని యువత సరిపెట్టుకుంటూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైనవి మూడు రంగాలు. ఒకటి వ్యవసాయం. రెండు పరిశ్రమలు. మూడు సేవలు. మూడింట్లో కూడా వ్యవసాయమే దేశ జనాభాలో ఎక్కువ శాతానికి జీవనోపాధిని కల్పిస్తోంది.

స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు అయినా, నేటికీ  వ్యవసాయ రంగం కల్పిస్తున్నంతగా పరిశ్రమలు, సేవల రంగాలు ఉపాధిని ఇవ్వడం లేదు! దీనికి ఒక కారణం నైపుణ్యాల లేమి. ఉపాధికి అవసరమైన విద్యను భారత్‌ తన యువతరానికి ఇవ్వలేక పోతోందన్న విమర్శ ఒకటి ఉంది. దేశంలో వెయ్యి వరకు విశ్వవిద్యాలయాలు, దగ్గరదగ్గర 50 వేల కాలేజ్‌లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఉన్నత విద్యావ్యవస్థ అనుకోవాలి. అయితే అసోచామ్‌ నివేదిక ప్రకారం ఈ విద్యాలయాల్లోంచి ఏటా 50 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులై వస్తుండగా, వారిలో కేవలం 25 శాతమే ఉపాధి పొందుతున్నారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని వచ్చే 25 ఏళ్లల్లో కనీసం 50 శాతం విద్యార్థులైనా వృత్తి విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని జాతీయ విద్యావిధానం సూచించింది. 

మరిన్ని వార్తలు